ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల పార్ట్-2 దరఖాస్తులకు వేళాయే..!
– రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
– అభ్యర్థుల దృవీకరణ పత్రాలు తప్పనిసరి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియకు వేళ అయ్యింది. ఆన్‌లైన్‌లో రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్ల కింద విడుదల చేసిన 554 ఎస్సై, 16,321 కానిస్టేబుల్ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాయగా వారిలో 2.69 లక్షల మంది అర్హత సాధించారు. అయితే పరీక్షలో అర్హత సాధించిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులు పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియకు సిద్దం కావాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. ముందుగా అవసరమైన ధ్రువీకరణపత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించవల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసేందుకు అక్టోబరు 27 నుంచి నవంబరు 10 వరకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేస్తేనే అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధిస్తారు. రాష్ట్రంలో తొలిసారి నియామకాలు జరుగుతుండంతో రాష్ట్రపతి జారీ చేసిన కొత్త ఉత్తర్వులు కీలకంగా మారాయి. తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలను జిల్లా, కంటీజియస్ జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా కేడర్లలో స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలుంటాయని స్పష్టం చేయడంతో అభ్యర్థులు స్థానికతను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని కోసం 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న పాఠశాలల నుంచి పొందిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత కానుంది. ఒకవేళ ఈ పత్రాల్ని సమర్పించకపోతే స్థానికేతరులుగా పరిగణించే అవకాశం ఉంది. అప్పుడు నాన్‌లోకల్ కోటాలో 5 శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులను జనరల్ కేటగిరిగా పరిగణించకుండ ఉండేందుకు కుల ధ్రువీకరణపత్రాలు తప్పనిసరి. దీంతో పాటు నేటివ్ సర్టిఫికెట్, పుట్టినతేదీ నిర్ధారణకు పదో తరగతి మార్కుల షీటు, డిగ్రీ మార్కుల షీటు, ఇంటర్ మార్కుల షీటు, కుల సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, బీసీ అభ్యర్థులకు 2021 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్, సర్వీస్ సర్టిఫికెట్, మాజీ సైనికోద్యోగులు/ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా ఉద్యోగాల కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా డిశ్ఛార్జి బుక్ సమర్పించాలని పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు స్పష్టం చేసింది.

