దస్తగిరి పేట్‌లో దాహం కేకలు..!
– మరమ్మత్తులకు నోచని మిషన్ భగీరథ పైపులైన్లు
– 15 రోజులైనా పట్టించుకోని అధికారులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం అంతారం గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గ్రామంలో తాగునీటికి తీవ్ర కటకట నెలకొంది. కొన్ని వారాలుగా తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని గ్రామ వార్డు మహిళలు వాపోతున్నారు. విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలపడంతో 15 రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మత్తుల కోసం గుంతలు తవ్వి వదిలేశారు. పైపులైన్ లు జామ్ అయ్యాయని పేర్కొంటూ ఇప్పటి వరకు మరమ్మత్తులు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకపోతే మహిళలమంతా ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

