అది అత్యంత బాధకరమైన అనుభవం

క్రైం జాతీయం తెలంగాణ రంగారెడ్డి రాజకీయం హైదరాబాద్

అది అత్యంత బాధకరమైన అనుభవం
– అర్దరాత్రి ఆ అధికారి ఇంట్లోకి చొరబడ్డాడు
– ధైర్యం, చాకచక్యంతో రక్షించుకున్న
– వైరల్ అయిన ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌ ట్వీట్
– అసలు ఏం జరిగిందంటే
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: అకస్మాత్తుంగా జరిగే సంఘటనలు సామన్యులతో పాటు అధికారులను హడలెత్తిస్తాయి. అలాంటి అత్యంత బాధాకరమైన అనుభవం తనకు ఎదురైందని ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తెలిపారు. ధైర్యం, చాకచక్యంతో తనను రక్షించుకున్నానని ఆమె ట్వీటర్ ద్వారా తెలిపారు. ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అసలేం జరిగిందని వివరాల్లోకి వెళితే.. ఐఏఎస్ అధికారిణి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మిత సభర్వాల్ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. స్మితా సభర్వాల్‌ ట్వీట్లకు మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్‌(48) ఒకట్రెండుసార్లు రీట్వీట్లు చేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ఓ హోటల్‌ యజమానిని వెంట తీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్‌కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్‌ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్‌ డోర్‌ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు తట్టాడు. డోర్‌ తెరిచిన మహిళా ఐఏఎస్‌కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో స్మిత సభర్వాల్ నివ్వెరపోయారు. కొద్ది సేపటికి ఆమె.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించగా గతంలో మీకు ట్వీట్‌ చేశానంటూ డిప్యూటీ తహసీల్దార్‌ చెప్పుకొచ్చాడు. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని సమాధానమిచ్చాడు. అర్దరాత్రి వేళ ఇంటికి వచ్చినందుకు ఆమె ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో భద్రతాసిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై స్మిత సభర్వాల్ ట్వీటర్‌లో సమాచారాన్ని ట్వీట్ చేశారు.
‘‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర స్థితిలో డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి’’ అని ట్వీట్‌లో స్మితా సభర్వాల్‌ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు.

Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life. Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency

— Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023