కూసిన ఎన్నికల కోడ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కూసిన ఎన్నికల కోడ్..!
– అమల్లోకి నిబంధనలు
– విగ్రహాలకు ముసుగు, ఫ్లెక్సీ, జెండాల తొలగింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తాండూరులో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలోని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 16న నోటిఫికేషన్‌, 23 వరకు నామినేషన్లు, 24న పరిశీలన, 27న ఉపసంహరణకు గడువు, వచ్చేనెల మార్చి13న ఎన్నికలు జరుగుతాయని షెడ్యూల్‌లో స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధల ప్రకారం మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా, మల్ రెడ్డిపల్లి, పాత తాండూరు, విజయ విద్యాలయ పాఠశాల తదితర ప్రాంతాల్లోని నేతలు, మహనీయుల విగ్రహాలకు ముసుగు వేశారు. దీంతో పాటు పట్టణంలోని ప్రధాన వీధులు, కాలనీలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ, రాజకీయ నేతలకు సంబంధించి పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తొలగింపు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కోడ్ అమల్లో ఉంటుందన్నారు.

కోడ్‌ నిబంధనలు ఇలా
ఎమ్మెల్సీ కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధిస్తుంది. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించరాదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీక్షలు నిర్వహించరాదు. రాజకీయ ఫ్లెక్సీలు, జెండాలు ఉంచరాదు. ఎన్నికల కోడ్‌ ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.