వృద్ధులు, అనాథల సేవలో అయ్యప్ప దీక్షా సమితి
– తాండూరు ఆర్టీసీ బస్టాండ్లో అల్పహారం వితరణ
తాండూరు, దర్శినిప్రతినిధి: భక్తితో పాటు వృద్ధులకు, అనాథలకు సేవలు అందించి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరించింది. బుధవారం అయ్యప్ప స్వామి జన్మనక్షత్రం అయిన ఉత్తర నక్షత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అల్పహార వితరణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తాండూరు ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులతో పాటు వృద్ధులకు, అనాథలకు అల్పహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటి అధ్యక్షులు వెంకట్రావ్ మాట్లాడుతూ సమితి సభ్యులు భక్తి భావంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు బాకారం జైపాల్ రెడ్డి, ప్రచార కార్యదర్శి కొంపల్లి రమేష్, కోశాధికారి మనోజ్ గౌడ్, శ్రీనివాస్, భీంచారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

