గోవాలో తాండూరు వ్యాపారి మృతి
– నాలుగు రోజుల కిందే పోలిస్టేషన్‌లో మిస్సింగ్ కేసు
– ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన నాపరాతి వ్యాపారి గోవాలో మృతి చెందాడు. తాండూరు పోలీస్టేషన్‌లో నాలుగు రోజుల కిందటే నమోదైన మిస్సింగ్ కేసు ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం ముదేళ్లికి చెందిన షాదీపూర్ రాఘవేందర్(38) చాలా ఏండ్ల క్రితం నుంచి తాండూరు పట్టణం శివాజీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రాఘవేందర్ తాండూరులోనే స్టోన్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఈనెల 15వ తేదిన ఇంటి నుంచి విజయవాడ వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. మరుసటి రోజు నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండు, మూడు రోజులు వేచి చూసినా రాఘవేందర్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో భార్య తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు 24వ తేదిన పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాఘవేందర్ సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా సిగ్నల్‌ను ట్రాఫ్ చేయగా గోవాలో చూపించడంతో పోలీసులు, బంధువులు అక్కడికి వెళ్లారు. అక్కడ విచారించగా రాఘవేందర్ గోవా ఆసుపత్రిలో మృతి చెందినట్లు గుర్తించారు. అయితే విజయవాడ వెళతానని చెప్పి రాఘవేందర్ గోవా వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాటు రాఘవేందర్ ఆరోగ్యం అంతగా బాగాలేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. మద్యం సేవించరాదని వైద్యులు సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారి అన్నారు. అయితే గోవా వెళ్లిన రాఘవేందర్ అక్కడ మద్యం సేవించి అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నామని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.

