పడగొట్టకుండా పైకి లేచే ఇళ్లు..!
– హైడ్రాలిక్ జాకీలతో ఇంటి ఎత్తు పెంపు
– జిల్లాలో మొదటిసారి టెక్నాలజీ వినియోగం
– తాండూరులో ముమ్మరంగా జరుగుతున్న పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఒక్క ఐడీయాతో ఎవరైనా పైకి వస్తారు. అదే ఐడియాతో హైట్ తక్కువగా ఉన్న ఇంటిని పైకి తీసుకరావచ్చు. అది కూడా ఇంటికి ఎలాంటి డ్యామెజ్ లేకుండా ఎత్తు పెంచుకోవచ్చు. ఇంటిని పైకి తీసుకరావడం, ఎత్తు పెంచడం ఎలా సాధ్యమవుతుందని అంటారా..? అభివృద్ధి దేశాల్లో, పెద్ద నగరాలలో అందుబాటులోకి వచ్చిన హౌస్ లిఫ్టింగ్, సిప్టింగ్ టెక్నాలజీ ఇప్పుడు పట్టణాలకు కూడా పాకింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో మొట్ట మొదటి సారి ఇంటిని పైకిలేపే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను పరిశీలిస్తున్న ప్రజలు కొత్త టెక్నాలజీ అదుర్స్ అంటున్నారు. పదండి మరీ ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారి వివరాలను తెలుసుకుందాం. తాండూరు మండలం పర్వాతాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి గత ఐదేళ్ల క్రితం తాండూరు పట్టణం గ్రీన్ సిటీలో 260 గజాల్లో నిర్మించిన ఇంటిని కొనుగోలు చేశారు.
అప్పటి నుంచి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లు గుంతలో ఉండడంతో వర్షపు వీరంతా ఇంట్లోకి వచ్చేది. వర్షపు నీటితో ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లలేక వర్షాకాలమంతా ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో తన సన్నిహితులు హైడ్రాలిక్ టెక్నాలజీతో ఇంటిని పైకి లేపే వ్యవస్థను తెలిపారు. ఈ మేరకు తాండూరుకు చెందిన మహమ్మద్ సోహైబ్ అహమ్మద్ అనే సివిల్ ఇంజనీర్ హైదరాబాద్ లో జూబ్లీ కన్స్ స్ట్రక్షన్ . ద్వారా ఈ వ్యవస్థతో పలు ఇండ్లను పైకి ఎత్తు లేపినట్లు తెలిసి సంప్రదించారు. దీంతో అతనిని సంప్రదించి అగ్రిమెంట్ చేసుకున్నారు.
జాకీలతో ఇంటి ఎత్తు పెంపు

సివిల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇంటిని పైకి లేపి పనులు చేపట్టారు. గత రెండు రోజుల నుంచి ఇంట్లో పనులు చేపట్టారు. 45 టన్నుల సామర్థ్యం ఉన్న ఇంటిని పైకి లేపేందుకు మొత్తం 130 జాకీలను పెట్టి పైకి లేపుతున్నారు. ఇందుకు మొత్తం 18 మంది కార్మికులు ఒకేసారి పనులు చేస్తున్నారు. ఇంటి యజమాని కోరిక మేరకు ఇంటిని 3 ఫీట్ల ఎత్తుకు పెంచుతున్నారు. ఇంకా 25 రోజుల పాటు ఈ పనులు కొనసాగుతాయని సివిల్ ఇంజనీర్ తెలిపారు. ఈ వ్యవస్థతో ఎలాంటి నష్టం, డ్యామేజీ జరగదిన గ్యారెంటీ ఇస్తున్నారు.
టెక్నాలజీ బాగుంది: యజమాని రవీందర్ రెడ్డి
ఎంతో ఇష్టంగా కొనుకున్న ఇంటిని పైకి లేపడం కోసం కూల్చి వేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళనకు గురయ్యా, అలాంటి సందర్భంలోనే సన్నిహితుల ద్వారా హైడ్రాలిక్ టెక్నాలజీతో ఇంటిని పైకి లేపవచ్చని తెలుసుకున్నా. లోతులో ఉన్న ఇంటిని పైకి ఎత్తు పెంచడం బాగుంది. ఇంటి డ్యామేజీ లేకుండా ఇంటిని పైకిలేపే హైడ్రాలిక్ టెక్నాలజీ అద్భుతంగా ఉంది. ఇందుకు దాదాపు రూ. 3.50లక్షల ఖర్చు అవుతోంది.

