దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
– పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
– శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దు
– బక్రీద్ పండగకు పకడ్బందీ బందోబస్తు పెట్టాలి
– వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీస్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనాల కేసులను చేధించేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా అన్నారు.

మంగళవారం తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్‌ను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహా మెహ్రో పోలీస్టేషన్‌ సీఐ పరమేశ్వర్ గౌడ్, ఎస్ఐలు, సిబ్బందితో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ పరిధిలో నమోదైన పలు కేసులు, క్రైమ్ రిజిస్టర్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని అన్నారు. పోలీస్టేషన్‌లో నమోదైన దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు.

రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని తాండూర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పండగను దృష్టిలో ఉంచుకుని స్థానిక మత పెద్దలు, ప్రముఖులతో తక్షణమే పీస్ కమిటీ (శాంతి కమిటీ) సమావేశాలను ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనల్ అంశాలకు సంబంధించి పాత నేరస్తులు, రౌడీ షీటర్లు మరియు అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైతే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అన్నారు. ఈ తనిఖీలో స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పినా సిగ్గురాలే..!