కుప్పకూలిన బిల్డింగ్ స్లాబ్..!
– స్థానికులకు తప్పిన ప్రమాదం
– అక్రమ నిర్మాణ పనులపై ఆగ్రహం
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: అక్రమంగా నిర్మిస్తున్న ఓ ప్రవేటు ఆసుపత్రి భవనం స్లాబ్ కుప్పకూలి పోయింది. అదృష్ట వశాత్తు స్థానికులకు ప్రమాదం తప్పింది. ఈ భయాందోళన సంఘటన గురువారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరుకు చెందిన శెట్టి వైశాలి బస్వరాజ్ పట్టణంలోని శాంతి నగర్ సాయిపూర్ రోడ్డు మార్గంలో ప్రవేటు ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారుల నుంచి మూడో అంతస్తు వరకు మాత్రమే అనుమతులు పొందినట్లు సమాచారం. కాని నాలుగు అంతస్తులతో భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. గురువారం కృష్ణాష్టమి సెలవు దినం రోజున పనులు శరవేగంగా చేపట్టారు. నాలుగో అంతస్తు వద్ద బాల్కాని కోసం వేసి స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. స్లాబ్ నిర్మాణ వ్యర్థాలు పక్కనే ఉన్న బీ రవీందర్ అనే వ్యక్తికి చెందిన ఇంటిపై పడిపోయాయి. అదే సమయంలో ఎవ్వరికి ఎలాంటి హాని జరగకపోవడంతో ప్రమాదం తప్పింది. స్లాబ్ పడిపోయిన వెంటనే వచ్చిన భారీ శబ్దానికి స్థానికులు. ఆందోళన చెందారు. భయాందోళనతో సంఘటన స్థలం నుంచి పక్కకు జరిగారు. వెంటనే మున్సిపల్, పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.
అక్రమంగా నిర్మించడమే కాకుండా సెట్ బ్యాక్ వంటి ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సుభాష్, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే పనులను నిలిపివేయించారు.
ఇది కూడా చదవండి..

