ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ విత్తనాలు..!
– విక్రయేత ముఠాపై ఉక్కుపాదం
– నాలుగు క్వింటాళ్ల విత్తనాలు సీజ్
– ఇద్దురు వ్యక్తులపై కేసు నమోదు
– బషీరాబాద్ మండల పరిధిలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు యత్నించిన ముఠాపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గుర్తింపు లేని నకిలీ విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. రైతులను మోసం చేయాలనుకున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం బషీరాబాద్ ఎస్. ఐ రమేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి వెన్నెల సూర్య ప్రకాష్‌తో కలిసి మండలంలో ఏక్మాయి గ్రామానికి వెళ్లారు.
ఇద్దరు వ్యక్తులు తమ చేతులలో ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక రాష్ట్రం మదికంటి గ్రామానికి చెందిన బోయింది విఠలప్ప, దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన చిన్న గుంట వెంకట్రాములుగా గుర్తించారు. దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరాములు అనే వ్యక్తి వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకొని గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

కేజీ రూ. 1800లకు విక్రయిస్తున్నారని, అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి రైతులకు అమ్ముతున్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. దీంతో వారి వద్ద నుంచి దాదాపు నాలుగు క్వింటాళ్ల పదిహేను(415) కేజీల నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. విక్రయానికి పాల్పడినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతులు వ్యాపారుల మాయమాటలు నమ్మి నకిలీ విత్తనాలను కొనుగోలు చేయరాదని సూచించారు. ఎవరైనా లూజుగా విత్తనాలను విక్రయించేందుకు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

