కీలాడీ దంపతులు…!

క్రైం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

కీలాడీ దంపతులు…!
– ఒంటరి మహిళలే వారి టార్గెట్
– భార్య సహాకారంతో భర్త అత్యాచారాలు
– నిందితులకు జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : జల్సాలకు అలవాటు పడిన కిలాడీ దంపతులు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని హత్యోందంతాలకు పాల్పడ్డారు. మహిళలను నిర్జన ప్రదేశాలతకు తీసుకెళ్లి భార్య సహాకారంతో భర్త వారిపై అత్యాచారాలకు పాల్పడి హత్య చేసి అందినకాడి దోచుకుని నేర ప్రవృత్తిని ఎంచుకున్నారు. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడిన నిందితులకు రంగారెడ్డి జిల్లాలోని కోర్టులు జీవిత ఖైదు శిక్షలను విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. వికారాబాద్‌జిల్లా పెద్దేముల్‌ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన కురువ స్వామి అలియాస్‌ రవి(30), మాసనమొల్ల నర్సమ్మ అలియాస్‌ కురువ నర్సమ్మ భార్యాభర్తలు. వీరు సంగారెడ్డిజిల్లా ఐడీఏబొల్లారంలోని వైఎస్సార్‌కాలనీలో స్థిరపడ్డారు.

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించడానికి ఒంటరి మహిళలను మాయమాటలతో తీసుకెళ్లి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. శంకర్‌పల్లి ఠాణా పరిధిలో 2021 జులై 18న సింగాపురం గ్రామంలో కూలీ పని చూపిస్తామని ఓ మహిళను బులక్‌పూర్‌గేట్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. భయభ్రాంతులకు గురి చేసి భార్య నర్సమ్మ సాయంతో స్వామి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెపై దాడి చేయగా అచేతనావస్థలోకి పోగా చనిపోయిందని భావించి ఆ మహిళ చరవాణి, ఒంటిపై ఉన్న ఆభరణాలు, నగదు తీసుకొని పరారయ్యారు.

2021 జులై 25న మల్లంపేట్‌ అడ్డాలో పని కోసం నిరీక్షిస్తున్న ఓ మహిళ(35)కు కూలీ పని ఉందని చెప్పి బైక్‌పై తీసుకెళ్లారు. దుడిగల్‌ ఠాణా పరిధిలోని మంత్రికుంట గ్రామ శివారులోని నిర్జన ప్రదేశంలో ఆమెపై రవి అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది. భార్య నర్సమ్మ ఆమెను గట్టిగా బంధించగా స్వామి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి ఒంటి మీదున్న ఆభరణాలు దోచుకొని క్రూరంగా హింసించి హత్య చేశారు. శంకర్‌పల్లి, దుండిగల్‌ పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు. శుక్రవారం కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి డా.కె.పట్టాభిరామారావు తీర్పునిచ్చారు. అమీన్‌పూర్‌ ఠాణా పరిధిలో మరో దోపిడీకి పాల్పడ్డ ఈ దంపతులకు న్యాయస్థానం ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది. ఈ సంచలన నిందితులపై ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి..

లక్కీ.. విన్నర్స్‌…!