డబ్బులిచ్చి.. దాడులు..!
– ఓర్వలేక బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు
– ఉనికికోసం లగచర్ల లడాయి రాద్దాంతం
– బీఆర్ఎస్ నేతల పరామర్శ వ్యవహాం సిగ్గుచేటు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిది : వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారుల దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రదారులు ఉన్నారని, డబ్బులు పంచి దాడులు చేయించారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వికారాబాద్‌లో జరిగిన మీడియాతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. లగచర్లలో జరిగిన అధికారులపై దాడి సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశంగా మారిందన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేని పనికి నిదర్శనమన్నారు. దీని వెనుక కేసీఆర్, కేటీఆర్, హరిష్ రావులు ఉన్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికి వికారాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
ఇందులో భాగంగా లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మెడికల్ ఇన్సిట్యూట్స్, ఇంజనీరింగ్ కాలేజీలు తదితర అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకవస్తుంటే.. కండ్లు మండి ఓర్వలేక బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేయించారని అన్నారు. ఇందుకు సుమారు రూ.1కోటి నుంచి రూ. 50లక్షల దాక కార్యకర్తలకు పంచిపెట్టారని ఆరోపించారు. రాజకీయంగా ఓర్వలేక డబ్బులు ఇచ్చి దాడులు చేయించారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి జనాలలో ఆధరణ కోల్పోవడంతో కావాలనే అధికారులపై దాడులు చేయించడం దురదృష్టకరమన్నారు.
అధికారులపై దాడి చేసిన వారిని మాజీ స్పీకర్ మధుసూదన చారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డా.మెతుకు ఆనంద్, నరేందర్ రెడ్డి, శుభప్రద్ పటేల్ లు పరామర్శించేందుకు రావడం సిగ్గుచేటన్నారు. లగచర్ల లడాయిని రాజకీయ ఉనికి కోసం రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. మునుముందు జరిగే కేటీఆర్ అరెస్టు పర్వాలను కూడా తప్పుదోవ పట్టించేందుకు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఫార్మాసిటి వివాదంలో భూ బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి…

