ఆరు గ్యారెంటీలు దగా..!
– అబద్దాలతో మోసపూరిత పాలన
– ఏడాది పాలనలో ఒరిగిందేమి లేదు
– కాంగ్రెస్ విజయోత్సవాలపై మండిపడిన బీజేపీ
– తాండూరులో బైకు ర్యాలీతో నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో అందరిని దగా చేస్తుందని బీజేపీ నేతలు అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో బీజేపీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సంబరాలను వ్యతిరేకిస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో దగా పాలన చేస్తుందని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు, 66 ఆబద్దాలతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. రైతుభరోసా, రైతురుణమాఫీ, మహిళలకు, నిరుద్యోగులకు ఆర్థిక సాయం వంటి పథకాలను అమలులో విఫలమయ్యిందన్నారు. వరిధాన్యం విషయంలో రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌లాగానే సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంను నమ్మే పరిస్థితులు గగనమై పోతున్నాయని అన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రత్యామ్నాయంగా నిలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బీఎస్ఎన్‌ఎల్ కౌన్సిల్ సభ్యులు గాజుల శాంతుకుమార్, బంటారం భద్రేశ్వర్, నాయకులు శేఖాపురం ఆంజనేయలు, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

