వారి భేటి ప్ర‌త్యేకం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వారి భేటి ప్ర‌త్యేకం..!
– జెడ్పి చైర్‌ప‌ర్స‌న్, గ్రంథాలయ చైర్మ‌న్‌ల క‌ల‌యిక
– వికారాబాద్ జిల్లా రాజ‌కీయాల్లో అల‌జ‌డి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: కొన్ని రోజుల క్రితం రాజ‌కీయ ప‌రంగా వారివి భిన్న ప్ర‌యాణాలు. ఒక‌రిపై ఒకరికి విభిన్న బేధాభిప్రాయాలు. అలాంటి ఇద్ద‌రి క‌ల‌యిక ప్ర‌త్యేక‌మే. ఇక రాజ‌కీయ వ‌ర్గాల‌లో తీవ్ర అల‌జ‌డే. విమ‌ర్శ‌కుల‌కు… విశ్లేష‌కుల‌కు ఆస‌క్తిక‌ర చ‌ర్చే. అలాంటి సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్‌గా ప‌ట్నం సునితామ‌హేంద‌ర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి కొన‌సాగుతున్నారు. తాండూరు కేంద్రంగా ఇద్ద‌రు రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్నారు. అదే తాండూరుకు చెందిన గాజీపూర్ ముర‌ళీకృష్ణ గౌడ్ వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మ‌ద్య వ‌ర్గ‌పోరు కొన‌సాగుతోంద‌ని అంద‌రికి తెలిసిందే. గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ గాజీపూర్ మురళీకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ‌ర్గం వైపు ఉన్నారు. అయితే గ‌త కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముర‌ళీకృష్ణ‌గౌడ్‌ను దూరంగా ఉంచిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలోనే ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి స‌తీమ‌ణి, వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డితో గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ‌గౌడ్ భేటి కావ‌డం తాండూరు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బిన్న ధృవాలు ఉన్న ఇద్ద‌రు నేత‌లు క‌ల‌వ‌డంపై విమ‌ర్శ‌కుల్లో అల‌జ‌డిని రేకెత్తించింది. వికారాబాద్, తాండూరులో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి, గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ గౌడ్‌ల ప్ర‌త్యేక భేటిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. వారిద్ద‌రి భేటిలో యాలాల మండ‌లానికి చెందిన టీఆర్ఎస్ నేత సిద్రాల శ్రీ‌నివాస్ కూడ ఉండ‌డంతో మరింత ఆసక్తిగా చ‌ర్చించుకున్నారు.

గ్రంథాలయాల అభివృద్ధిపై చ‌ర్చ‌లు : చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ‌గౌడ్
అయితే జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డితో భేటీ వెనుక ఇత‌ర కార‌ణాలేమి లేవ‌ని గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ‌గౌడ్ అన్నారు. జిల్లాలోని గ్రంథాల‌యాల అభివృద్ధితో పాటు తాండూరు రాజ‌కీయ అంశాల‌పైనే చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.