రోజుకు రూ.2లతో రూ. 10లక్షల బీమా..!
– పోస్టాఫీసులో గ్రూప్ గార్డ్ యాక్సిడెంట్ పాలసీ
– ఏ ప్రమాదం జరిగినా అకౌంట్లోకి డబ్బులు
– మారిన కొత్త రూల్స్ కూడా తెలుసుకోండి
దర్శిని డెస్క్ : స్పీడ్ జోన్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఇన్సురెన్స్‌లు తీసుకోవాల్సిన కాలం ఇది. చాలా మంది జీవిత భద్రత కోసం, తాము మరణించినా కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద రాకుండా ఉండాలని ఎన్నో రకాల పాలసీలను తీసుకుంటున్నారు. అయితే రోజుకు సుమారు రూ. 2ల ఖర్చుతో పోస్టాఫీసులో రూ. 10లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. గతంలో రూ. 520లకు ఉన్న ఈ పాలసీలో కొన్ని మార్పులు జరిగాయి.

ప్రస్తుతం ఈ బీమా పథకం ప్రీమియంను రూ. 699లకు మార్చారు. గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ పేరుతో పోస్టాఫీసు ఈ పథకాన్ని అమలు చేస్తుంది. టాటా ఏఐజీ, బజాజ్, స్టార్, నివా తదితర కార్పోరేట్ సంస్థల సహాకారంతో బీమా పథకాన్ని అమలు చేస్తుంది.
టాటా ఏఐజీ ద్వారా ఈ ప్లాన్ కింది మీరు ఏడాదికి రూ.699 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల హాస్పిటల్లో చేరితే యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు కోసం రూ.లక్ష అందిస్తారు. అంతే కాకుండా హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ. 1000ల ఖర్చులు కూడా చెల్లిస్తారు. ప్రమాదంలో శాశ్విత వికలాంగత్వం ఏర్పడితే రూ. 10లక్షలు మంజూరు చేస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల ఇస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల ఖర్చులు రూ. 5వేలు అందుతాయి. ఈ ప్లాన్ కింద ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు రూ. 1లక్ష వరకు ఆర్థిక సాయం అందుతుంది. కుటుంబ సభ్యుల రవాణా ఖర్చులు కూడా పోస్టాఫీసులో రూ. 25వేలు అందిస్తారు.
అర్హులు, కవరేజ్ ఇలా
18 నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆత్మహత్య చేసుకున్నా, మిలటరీ సర్విసెస్‌లో ఉంటూ మరణించినా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి కన్నుమూసినా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వంటి వాటివల్ల చనిపోయినా.. ప్రమాదకరమైన క్రీడల్లో మృత్యువాత పడినా ఈ ఇన్సూరెన్స్ లభించదు. కాని పాము కాటుతో మరణించినా, అంగవైకల్యం జరిగినా, విద్యుత్ షాక్ తో మరణించినా బీమా వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరినా ఇన్సురెన్స్ వర్తిస్తుంది. దీంతో ప్రజలు అధికసంఖ్యలో బీమా చేయించుకుంటున్నారు. ఖాతాదారుడి వయస్సు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇదికూడా చదవండి….

