అర్ధరాత్రి పశువుల రవాణా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అర్ధరాత్రి పశువుల రవాణా..!
– దగ్గరుండి తరలించిన అటవీశాఖ అధికారి..?
– అడ్డుకున్నందుకు యువకులపై దాడికి యత్నం
– తాండూరు డీఎస్పీకి, పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు
– దాడిని, రవాణాను ఖండించిన బీజేపీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్ధరాత్రి వేళ పశువులను తరలించడం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో వివాదాస్పదంగా మారింది. అటవీ శాఖ అధికారే దగ్గరుండి డీసీఎంలో తరలించారని, అడ్డుకునేందుకు వెళితే.. దాడికి యత్నించారంటూ యువకులు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రాత్రి పెద్దేముల్ మండలం జనగామలో జరిగిన ఘటనపై బాధితులు పెద్దేముల్ పోలీసులకు, తాండూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ గ్రామ సమీపంలో ఓ ఆటవీ శాఖ అధికారికి సంబంధించిన ఫాంహౌస్ నుంచి మంగళవారం అర్ధరాత్రి సమయంలో డీసీఎం వాహనంలో సుమారు 16 నుంచి 20 పశువులను తరలిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అదే మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన యువకులు రమేష్ సాగర్, రాము, అంజిలు తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్రమ రవాణా పై డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. అప్పటికే అటవి శాఖ అధికారి వెనుక ఉన్న అక్రమార్కులు తమపై దాడి చేసేందుకు యత్నించారని యువకులు ఆరోపించారు. బుధవారం పెద్దేముల్ పోలీసులతో పాటు తాండూరు డీఎస్పీ కార్యాలయానికి వచ్చి పశువులను తరలించిన అధికారి, అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాధిత యువకుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని, నిజ నిజాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

దాడిని, రవాణాను ఖండించిన నేతలు
మరోవైపు పశువుల రవాణా, యువకులపై దాడి సంఘటనను బీజేపీ నేతలు ఖండించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, పట్టణ కార్యదర్శి అంతారం కిరణ్ తాండూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి మాట్లాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో పనిచె స్తున్న అటవి శాఖ అధికారి అర్ధరాత్రి వేళ పశువులను తరలించడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. అక్రమ రవాణాను అడ్డుకున్న యువకులపై దాడి చేయడాన్ని ఖండించారు. ఆటవిశాఖ అధికారి, పశువులను తరలించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదికూడా చదవండి…

కూల్చివేతలకు బ్రేక్…?