కూల్చివేతలకు బ్రేక్…?
– కదలని మున్సిపల్ యంత్రాంగం
– నోటీసులు అందజేతకు కసరత్తు
– తాజా పరిణామాలపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఆక్రమణల కూల్చివేతలకు బ్రేక్ పడినట్లుగా కనిపిస్తోంది. హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపట్టిన అధికారులు వేగం తగ్గించారు. రెండు రోజులుగా కూల్చివేతలు జరగకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. నాలుగు రోజుల క్రితం నుంచి తాండూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, ఇందిరా చౌరస్తా, విలియమూన్ చౌరస్తా మార్గాలలో ముమ్మరంగా కూల్చివేతలు చేపట్టారు. పట్టణ పోలీసుల సహాకారంతో దగ్గరుండి పట్టణంలోని దుకాణాల నిర్వహకులు రోడ్లపై ఏర్పాటు చేసుకున్న షెడ్లు, నిర్మాణాలను కూల్చివేశారు. అధికారుల చర్యలతో ఆక్రమణ దారులు, పలువురు వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. ఓ వైపు విమర్శలు వచ్చినా.. మరోవైపు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని రాజకీయ నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
అయితే పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ మార్గంలో కూల్చివేతలు ప్రారంభించే క్రమంలో బ్రెక్ పడింది. పలువురు రాజకీయ పెద్దల వద్దకు పరుగులు తీయడంతో కూల్చివేతలను ఆపేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు కూడా నోటీసుల పేరుతో మరింత ఆలస్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పెడుతున్న ట్రాఫిక సమస్యకు పరిష్కారం లభించి.. రోడ్ల విస్తరణ జరుగుతుందనే ఆశలను తలకిందులు జరిగినట్లుగా అయ్యిందని పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు కాకపోతే కూల్చివేతలకు ఇలాంటి సమయం మళ్లీ రాదని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కూల్చివేతలపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

ఇదికూడా చదవండి…

