19వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు..!
– కారణాలను వెల్లడించిన రవాణా శాఖ
– వాహన్ అప్లికేషన్ అములపై కీలక నిర్ణయం
– హడలెత్తిస్తున్న తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులపై రవాణా శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తూ వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్న వారి లైసెన్స్‌లను నిర్ధాక్ష్యణంగా రద్దు చేస్తోంది. 2023 డిసెంబరు నుంచి 2025 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లుగా వెల్లడించింది. మద్యం సేవించి లేదా మాదక ద్రవ్యాలు తీసుకుని, అతి వేగంతో డ్రైవింగ్ చేయడం లాంటి తీవ్ర ఉల్లంఘనలు ఇందులో ఉన్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రగతి నివేదికలో (ప్రొగ్రెస్ రిపోర్ట్‌లో) పలు అంశాలను వెల్లడించింది.

2024 నవంబరు 16వ తేదీ నుంచి 2025 జూన్ 30వ తేదీ వరకు 49,633 ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు(ఈవీలకు) రూ.369.27 కోట్ల రోడ్ ట్యాక్స్ మినహాయింపును ఇచ్చినట్లుగా ప్రగతి నివేదికలో పేర్కొంది. ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాల) పాలసీతో పరిమితి లేకుండా 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ‘వాహన్’ అప్లికేషన్ విధానంను వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి తీసుకవచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

అదేవిధంగా డ్రైవింగ్ స్కిల్‌ను పరీక్షించేందుకు 25 బైక్‌ల ట్రాక్‌లు, 27 ఫోర్ వీలర్, 5 భారీ వాహనాల ట్రాక్‌లను అధునాతన టెక్నాలజీతో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లుగా మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాహన ఉద్గారాలను పర్యవేక్షించేందుకు కాలుష్య టెస్టింగ్ సెంటర్లను(పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లు) కేంద్రీకృత ఐటీ ఆధారిత వ్యవస్థతో అనుసంధానానికి నిర్ణయం.
వాహనాలకు టీజీ కోడ్‌తో మార్పు
రాష్ట్రానికి చెందిన వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ కోడ్ ‘టీఎస్’ను 2024 మార్చి 15 నుంచి ‘టీజీ’గా మార్పు చేసినట్లుగా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి 13.05 లక్షల వాహనాలు ‘టీజీ’ కోడ్‌తో మార్పు.
ఈ పనులు చేయకుంటే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు
వాహనాలపై విధించిన ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోయినా, కొన్ని నెలలుగా ఆ బకాయిలు పెట్టినా వెంటనే చెల్లించుకోవాలని సూచించింది. నిర్లక్ష్యం చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. తాజా ముసాయిదా రూల్స్ ప్రకారం వాహన యజమానికి ఫైన్ విధిస్తే, అతడు మూడు నెలల్లోగా ట్రాఫిక్ ఈ చలాన్‌ను చెల్లించాల్సి ఉంటుంది. లేనట్లయితే అతడి లైసెన్స్‌ను రద్దు చేస్తారు. దీంతోపాటు ఒక ఆర్థిక సంవత్సరంలో రెడ్ సిగ్నల్‌ను దాటడం లేదా ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేసినందుకు మూడు చలాన్లు పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ కనీసం మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించనటువంటి డ్రైవర్లను శిక్షించేందుకు పలు చర్యలను కూడా ప్రతిపాదించింది.

ఇదికూడా చదవండి…

