తాండూరులో మెడికల్ కాలేజీకి ఏర్పాట్లు..!
– త్వరలో ప్రారంభోత్సవానికి చర్యలు
– జిల్లాలోని ఆసుపత్రుల మరమ్మత్తులపై దృష్టి
– భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఏర్పాటు చేయబోతున్న కోడంగల్ మెడికల్ కాలేజీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఎంసీహెచ్, మెడికల్ కాలేజీ భవనాలను తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అధికారులతో కలిసి సందర్శించారు.

ముందుగా జిల్లా ఆసుపత్రిని సందర్శించి పలు విభాగాలు, వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మరుగుదొడ్లు, బెడ్లు ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పైకప్పుల నుంచి నీటి తంపు లీకేజీలపై అంసతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని ఆదేశించారు. అనంతరం ఆసుప్రతి పైభాగంలోకి వెళ్లి పరిశీలించారు. ఆసుపత్రిలో చేపట్టాల్సిన మరమ్మత్తుల వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. అక్కడా కూడా వార్డులు, రోగులకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలు, సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నిర్మాణం పూర్తి దశలో ఉన్న కోడంగల్ మెడికల్ కాలేజీని సందర్శించారు. భవనంలో నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోడంగల్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే అధ్యాపకుల నియామకం, అధికారుల నియామకం జరిగిపోయిందన్నారు. కొన్ని వారాల్లోనే కాలేజీని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అదేవిధంగా జిల్లాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో మరమ్మత్తుల పక్రియలు చె పడుతున్నామన్నారు. ఆసుపత్రులలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృష్టిసారిస్తున్నామన్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇనుప వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, భారీ భవనాల వద్ద ఉండరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ సూపరిండెంట్ డా.మాలతి, జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి సూపరిండెంట్ డా. అల్లూరి సునీత, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజు, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి. తాండూరు తహసీల్దార్ తారాసింగ్. ఎంపీడీఓ విశ్వప్రసాద్. పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

