ఫాస్ట్‌గా పర్మిషన్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఫాస్ట్‌గా పర్మిషన్లు..!
– బిల్డింగ్, ఫ్లాట్లకు అనుమతలు ఈజీ
– కూర్చున్న చోటు నుంచే దరఖాస్తు
– బిల్డ్ నౌ యాప్‌ ద్వారా అమలు
– వాట్సాఫ్‌లోనే దరఖాస్తు స్థితి తెలుసుకోవచ్చు
– ఎలా అమలు చేస్తున్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తప్పిపోయాయి. కూర్చున్న చోటు నుంచే భవనం, లేఅవుట్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకునే కాలం వచ్చింది. టెక్నాలజీకి అనుగుణంగా అర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌ ద్వారా పని చేసే బిల్డ్ నౌ అనే యాప్‌ను మున్సిపల్ శాఖ అందుబాటులోకి తీసుకవచ్చింది.
kvcs
టీజీబీపాస్‌ ను రద్దు చేసి దీనిని అమల్లోకి తెచ్చారు. దీంతో.. బిల్డింగ్, లేఅవుట్ల నిర్మాణాలకు ఫాస్ట్‌గా పర్మిషన్లు వస్తున్నాయి. భవన నిర్మాణ, లే అవుట్‌ అనుమతులు అత్యంత వేగంగా పారదర్శకంగా జారీ చేసేందుకు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన బిల్డ్‌నౌ అప్లికేషన్‌ దూసుకుపోతోంది. ఎన్ని అంతస్తుల భవన నిర్మాణ దరఖాస్తు అయినా క్షణాల్లో స్క్రూట్నీతో పూర్తవుతోంది. దరఖాస్తుదారులతో పాటు అధికారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.

ఎలా పనిచేస్తుందంటే…?
జీవో 168 నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేసేలా బిల్డ్‌నౌను రూపొందించారు. దీంతో నిబంధనల ప్రకారం వివరాలుంటేనే ఆ దరఖాస్తును బిల్డ్‌నౌ స్వీకరిస్తుంది. సంబంధిత దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా క్షణాల్లోనే పూర్తవుతోంది. బిల్డ్‌నౌను తొలుత జీహెచ్‌ఎంసీలో అమలు చేయగా.. డీటీసీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్నీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేస్తున్నారు. పురపాలికల్లో లైసెన్సు కలిగిన ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లు, సివిల్‌ ఇంజినీర్ల ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 500 చ.మీ. లోపు విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు 15 రోజుల్లోనే అనుమతి లభిస్తుంది. అంతకుమించి విస్తీర్ణంలో నిర్మిస్తే 21 రోజుల్లో ఆమోదం తెలుపుతారు.

ప్రత్యేకతలిలా..
బిల్డ్‌ నౌ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారితంగా పనిచేస్తుంది.
ఆంగ్లంతో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సైబర్‌ నేరగాళ్లు బిల్డ్‌ నౌ యాప్‌లోని సమాచారం తస్కరణకు అవకాశం లేకుండా బ్లాక్‌చైన్‌ సాంకేతికతను వినియోగించారు.
ఇంటి నిర్మాణ స్థలం, లేఅవుట్‌ తెలిసేలా జీపీఎస్‌ చిత్రాలు అప్‌లోడ్‌ చేయడం వల్ల ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుంది.
దరఖాస్తు ఏ స్థితిలో ఉందో వాట్సాప్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది.
దరఖాస్తులోని లోపాలు, పొరపాట్లను గుర్తించి సరి చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
త్రీడీ డ్రాయింగ్‌ ఆధారంగా భవనం వీడియోను వీక్షించే సదుపాయాన్ని కల్పించారు.

ఇదికూడా చదవండి…

తాండూరు కమీషనర్‌కు షాక్..!