ఆ డేట్‌లో ఏం జరిగింది..!
– ఫైళ్ల సంతకాలపై అనుమానాలు
– శానిటేషన్ విభాగంలో అయోమయం
– తెల్లవారు జాము ఆఫీసుకి వస్తున్న అధికారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఆగస్టు 13వ తేదిని అందరు జపిస్తున్నారు. ఆ తేదిన ఏం జరిగిందని జోరుగా చర్చించుకుంటున్నారు. ఆగస్టు 21వ తేదితో 13వ తేదికి ఏం సంబంధం ఉందని రకరకాలుగా అనమానాలు వ్యక్తం చేస్తున్నారు.

శానిటేషన్ విభాగం నుంచే అనుమానాలు వ్యక్తమవడం గమనార్హం. గత కొన్ని రోజుల క్రితం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇంటి నెంబర్ కేటాయింపు విషయంలో లంచం తీసుకుంటూ అధికారి పట్టుబడ్డారు. ఆ తరువాత రెండు రోజులకే కార్యాలయంలో కీలక మార్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇక్కడ కమీషనర్‌గా పనిచేస్తున్న విక్రమ్ సింహారెడ్డిని బదిలీ చేశారు. ఈనెల 21వ తేదిన ఆయన ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో యాదగిరి కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే బదిలీపై వెళ్లిన కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు.

ఇందులో శానిటేషన్ విభాగంకు సంబంధించిన ఫైల్ కూడా ఉంది. ఈనెల 13న శానిటేషన్ విభాగంలో మరమ్మత్తులు చేపట్టినట్లు, దానికి సంబంధించిన ఫైళ్లపై పాత కమీషనర్‌తో సంతకాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి 13వ తేది ఎలాంటి మరమ్మత్తులు జరగలేదని, కాని ఫైళ్లపై సంతకాలు చేసుకోవడంపై గుసగుసలాడుతున్నారు. ఇందులో ఏమైనా మళ్లీ అవినీతికి పాల్పడుతున్నారేమో అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే విభాగంగా శానిటేషన్ ఇనుస్పెక్టర్ల విషయంలో అయోమయం ఏర్పడింది. ఈ విభాగంలో ఒకరికి ఇంచార్జ్ ఇచ్చినా కూడా మరోకరు అజమాయిషి చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు.

ఇందులో ఓ అధికారి సంబంధం లేకుండా తెల్లవారు జాము కంటే ముందే కార్యాలయానికి వస్తున్నారని తెలిసింది. కార్యాలయంలోకి రాకపోకలపై ఎవ్వరు ప్రశ్నించకుండా అనవసరంగా ఆగ్రహం(తిడుతూ) వ్యక్తం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ అధికారి శానిటేషన్ ఇనుస్పెక్టర్‌గా ఉన్న సమయంలో కార్మికుల కోసం తీసుకవచ్చిన సరుకులను కూడా అరకొరగా సరఫరా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక వస్తువు ఇస్తే.. మరో వస్తువు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇంతకు మున్సిపల్ కార్యాలయంలోని శానిటేషన్ విభాగంలో ఏం జరుగుతుందో అనేది అనుమానాలను రేకేత్తిస్తోంది.

ఇదికూడా చదవండి…

