ఈ యాప్ ఉంటే చాలు..!
– ఏ టికెట్ అయినా బుకింగ్ ఈజీ
– దేవాలయాల్లో దర్శనం, పూజా టిక్కెట్లు
– ఎక్కడో ఉన్న టూరిస్టు ప్లేస్‌ల ఎంట్రెన్స్ కూడా పొందొచ్చు
– అందుబాటులో రవాణా సర్వీసుల సేవలు
– ఎలా, ఎక్కడ డౌన్ చేసుకోవచ్చు అంటే..?
దర్శిని డెస్క్ : వేగంగా మారుతున్న టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం మనం. ఈ ఆధునికకతో ఇంటి వద్ద నుంచి.. లేదా నిలబడిన చోట నుంచే సేవలు పొందుతున్నాం. ఇదంతా యాప్‌ల మహిమే అని చెప్పకపతప్పదు. ఇప్పుడు మనం అందరికి ఉపయోగపడే యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. యాప్ ద్వారా ఎక్కడో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడి దేవాలయాల్లో దర్శనం, సేవా టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు(టూరిస్ట్ ప్లేస్)లోకి వెళ్లేందుకు ఎంట్రెన్స్ టిక్కెట్ కోసం బారులు తీరాల్సిన ఇబ్బందులు ఉండవు. బస్సు, రైలు టిక్కెటు కూడా ఈజీగా పొందవచ్చు.

డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్డీ) సాయంతో తెలంగాణ ప్రభుత్వం “మీ టికెట్ యాప్”ను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పలు రకాల టికెట్లను ఈ అప్లికేషన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆలయ దర్శనాలు, పార్కులు, బోటింగ్, జంతు ప్రదర్శనశాలల ప్రవేశం, బస్సు, రైలు టిక్కెట్ల రిజర్వేషన్ల తదితర సేవలన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో పొందొచ్చు.
యాప్‌లో అందుబాటులో ఉండేవి ఇవే
రాష్ట్రంలోని 15 ప్రముఖ దేవాలయాల్లో పూజల టికెట్లు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జంతు ప్రదర్శనశాలలు, మెట్రో, ఆర్టీసీ (త్వరలో రానుంది), మ్యూజియాలు, ప్లే, ఎంటర్టైన్మెంట్ జోన్లకు సంబంధించిన టికెట్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రముఖ ఆలయాలు యాదగిరిగుట్ట – శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కొమురవెల్లి – మల్లన్న ఆలయం, వేములవాడ – రాజరాజేశ్వరీ, కొండగట్టు – ఆంజనేయస్వామి, బాసర – సరస్వతి, భద్రాచలం – సీతారామచంద్ర స్వామి, ధర్మపురి, కాళేశ్వరం సహా హైదరాబాద్‌లోని మహంకాళి, గణేష్, పెద్దమ్మ తల్లి గుడి, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి, బల్కంపేట ఎల్లమ్మ, కీసర రామలింగేశ్వర ఆలయాలు ఇందులో కనిపిస్తాయి. ఆయా చోట్ల జరిగే నిత్య పూజలకు సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. ఎలాంటి అదనపు రుసుం లేకుండా యూపీఐ, టీ-వ్యాలెట్ ద్వారా నగదు చెల్లించవచ్చు.

అంతేకాకుండా జూ, గోల్కొండ, ఎన్టీఆర్ గార్డెన్, కేబీఆర్ నేషనల్ పార్కు, ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కృష్ణకాంత్ పార్కు, రాజీవ్‌గాంధీ పార్కు, గండిపేట పార్కు, సంజీవయ్య పార్కు, హుస్సేన్‌సాగర్ లేక్, ఉస్మాన్‌సాగర్, దుర్గం చెరువు, మీరాలం ట్యాంక్, సరూర్‌నగర్ చెరువుతోపాటు పలు పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ఇలా డౌన్లోడ్ చేసుకోండి:మీ స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి.
సెర్చ్ బార్లో ‘మీ టికెట్(Mee Ticket)’ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం లోగోతో యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్‌పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అందుకోసం ఫోన్ నంబరు అవసరమవుతుంది.
లాగిన్ బాక్స్‌లో కనిపించే Register ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్, 4 అంకెల పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత మీరు ఏ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్వీస్ ఓపెన్ చేసి కావాల్సిన సేవలు ఎంపిక చేసుకుని పేమెంట్ చేయాలి.
ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా యాప్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

ఇదికూడా చదవండి…

