లోకల్.. లెక్కలు.. ఇవీ..!
– అభ్యర్థులు ఈ రూల్స్ తప్పక తెలుసుకోల్సిందే
– పోటీ వయస్సు.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయొచ్చో తెలుసా
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి పల్లెల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ఎలా నిలవాలనే అంశాలపై ఆశావాహులు జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో దర్శిని న్యూస్ ద్వారా అందిస్తున్న నిబంధనలు తెలుసుకోండి. రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాల ద్వారా ఈ సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది.

రెండు స్థానాలకూ పోటీ చేయొచ్చు!
జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారు ఆ జిల్లాలోని గ్రామీణ ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లా ఓటరుకు జిల్లాలోని ఏ జెడ్పీటీసీ స్థానం నుంచి అయినా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసే వారు సంబంధిత మండలం ఓటరై ఉండాలి. ఆ ఓటరు ఆ మండలంలోని ఏ ఎంపీటీసీ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు (రిజర్వేషన్ స్థానం వర్తింపును బట్టి) అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకే మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎలాంటి అవకాశం ఉండదు. ఒక అభ్యర్థి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు రెండింటికీ ఏకకాలంలో పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలను బట్టి తెలుస్టోంది.

ఈ రిజర్వేషన్ల ద్వారా పోటీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి 21 ఏళ్ల వయసు పూర్తిచేసుకుని ఉండాలి. మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లలో వారే పోటీ చేయాలి. జనరల్ కేటగిరీ సీటుకు కూడా మహిళలు పోటీ పడొచ్చు. ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేయాలంటే.. తెలంగాణకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించిన ఏదేని ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందినవారై ఉండాలి. ఎస్టీలు ఏ వర్గానికి రిజర్వ్ కాని సీటు (జనరల్)కు కూడా పోటీ చేయొచ్చు. ఎస్సీలు, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన ఏదైనా సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ వర్గాల వారు కూడా ఏ విధంగానూ రిజర్వ్ కాని స్థానాలకు పోటీ చేయొచ్చు.
పోటీకి వీళ్లు అనర్హులు..
2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 22, 23, 24 సెక్షన్ల ప్రకారం అనర్హులై ఉండకూడదు. గతంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పిచనందుకు, సరైన పద్ధతిలో సమర్పించనందుకు ఎన్నికల సంఘం ద్వారా అనర్హులుగా ప్రకటించినవారు పోటీకి అనర్హులు. క్రిమినల్ కోర్టు ద్వారా శిక్ష పడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు అనర్హులు. శిక్ష ముగిసిన తేదీనుంచి ఐదేళ్ల పాటు అనర్హత వర్తిస్తుంది. 1955 పౌరహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం శిక్ష పడినవారు కూడా అనర్హులు. మతస్థిమితం లేనివారు, చెవిటి లేదా మూగవారు అనర్హులు. దివాలా తీసిన లేదా దివాలా నుంచి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించినవారు లేదా అందుకు (ఇన్సాల్వెన్సీ) దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులు.

మండల, జిల్లా పరిషత్ లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా చేపట్టిన ఏదైనా పనికి సంబంధించిన కాంట్రాక్ట్ పొందినవారు, అందులో భాగస్వామ్యం ఉన్నవారు అనర్హులు. ఏదైనా పారితోషికం పొందుతూ గ్రామ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న వారు అనర్హులు. 1973 నేర శిక్షా స్మృతి ప్రకారం మేజిస్ట్రేట్‌గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు అనర్హులు. ప్రస్తుతం లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి బకాయి పడి, ఆ బకాయి చెల్లించాలని బిల్లు/నోటీస్ ద్వారా తెలియజేసినా నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వారు అనర్హులు.
గ్రామ సహాయకునిగా (వీఆర్ఓ)గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిగా కానీ లేదా స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఏదైనా సంస్థల్లో ఉద్యోగిగా ఉన్నవారు అనర్హులు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో కార్యవర్గ సభ్యుడిగా ఉండకూడదు. అవినీతికి పాల్పడినందుకు కేంద్రం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగింపబడిన వారు తొలగించిన తేదీ నుంచి అయిదేళ్ల వరకు పోటీకి అనర్హులు.

ఇదికూడా చదవండి…

