తప్పుడు ఓట్లను తొలగించండి..!
– గందరగోళంగా విభజనపై తక్షణ విచారణ తప్పనిసరి
– తాండూరు మాజీ ఎమ్మల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పుడు ఓటర్లను తొలగించాలని తాండూరు మాజీ ఎమ్మల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలో తాజాగా విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. వార్డుల వారిగా జరిగిన ఓటర్ల విభజన కూడా చాలా గందరగోళంగా ఉందన్నారు. 2019–2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో తాండూరు పట్టణంలో మొత్తం ఓటర్ల సంఖ్య 64,090గా ఉండగా, 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ సంఖ్య 66,304కు పెరిగిందన్నారు.

అంటే నాలుగేళ్ల వ్యవధిలో కేవలం 2,214 ఓటర్ల మాత్రమే పెరుగుదల నమోదు కాగా తాజాగా 2026 సంవత్సరానికి విడుదలైన ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 77,110 అంటే 2023 తర్వాతి కాలంలోనే 10,806 ఓటర్లు అదనంగా నమోదైనట్లు అవుతోందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన ఓటర్లు, సహజ జనాభా పెరుగుదల కారణంగా కొంతమేర పెరుగుదల సహజమే అయినప్పటికీ, ఈ స్థాయిలో ఒకేసారి ఓటర్ల సంఖ్య పెరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి, అర్హతలేని మరియు తప్పుగా నమోదు అయిన ఓటర్ల పేర్లను తొలగించి, గత మున్సిపల్ ఎన్నికల వార్డు మ్యాపింగ్ ప్రకారం సరిచేసి ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, సలీం, అనురాధ, రవీందర్, బషారత్ అలీ, యూనిస్, అంజద్ ఖాన్, జావేద్, నరసింహ, అస్ఫక్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

