కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

కెరీర్ తాండూరు వికారాబాద్

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
– నిమిషం ఆల‌స్యమైనా అనుమ‌తి ర‌ద్దు
– గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి రావాలి
– తాండూరులో 28 పరీక్షా కేంద్రాలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఈనెల 28న నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరిండెంట్, అబ్జర్వర్లు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వారికి సలహాలు, సూచనలు అందజేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు తాగునీరు, విద్యుత్, వెలుతురు, గాలీ వచ్చే విధంగా ఏర్పాట్లను చేయాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పరీక్షలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆల‌స్య‌మైన అనుమ‌తించ‌డం కుదర‌ద‌న్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోవడం జరుగుతుందని, కావున అభ్యర్థులు గొరింటాకు, మెహెందీ వంటివి వేసుకోరాదని సూచించారు. సెల్‌ఫోన్, ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాలు నాట్ అలౌడ్ అన్నారు. సమయానికి చేరుకుని పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, నిబంధనలను పాటించి విజయవంతానికి సహకరించాలని అన్నారు. మరోవైపు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసే వాళ్లను నమ్మరాదని సూచించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, తాండూరు డీఎస్పీ శెఖర్ గౌడ్, డీటీసీ డీఎస్పీ విజయ్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.