వైభవంగా అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం
– పురవీధుల్లో శోభాయాత్ర ఊరేగింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఉదయం నుంచి ఆలయంలో భజన కీర్తనలు ఆలాపించారు. అయ్యప్ప విగ్రహాన్ని ఎత్తుకుని ఆలయం చుట్టు ప్రదక్షణలు నిర్వహించారు. మరోవైపు ఆలయ వార్షికోత్సవంను పురస్కరించుకుని ఆలయం నుంచి అయ్యప్ప స్వామి శోభాయాత్ర నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలోని పురవీధుల్లో శోభాయామానంగా కొనసాగింది. ఊరేగింపు ముందు స్వాములు, భక్తులు స్వామి భజన కీర్తనలు ఆలాపిస్తూ ముందుకు సాగారు.
పూజలు నిర్వహించి వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు

తాండూరు పట్టణంలోని పురవీధుల్లో సాగిన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురవీధుల గుండా వచ్చిన శోభాయాత్రలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పాల్గొన్నారు. శోభాయాత్ర ఊరేగింపులో అయ్యప్ప స్వామిని దర్శించుకుని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు ఘనంగా సన్మానించారు.

