విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం
– సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ లలిత
– తాండూరులో పరిష్కార వేదికకు స్పందన
– అత్యధిక ఫిర్యాదులు అందిన సమస్యలు ఏవంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ లలిత అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు.

స్థానిక విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు వ్యాపారులు, సామాన్య ప్రజలు హాజరై విద్యుత్ వినియోగ సమస్యలపై ఫిర్యాదులు చేసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లుల్లో ఎక్కువ, మీటర్ల సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్ ఓవర్ లోడ్ సమస్యలు తదితర వాటిపై ఫిర్యాదులను స్వీకరించారు. సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ లలితకు ఫిర్యాదులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యలను పరిష్కరిచడం కోసమే పరిష్కార వేదికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఇందులో అందిన ఫిర్యాదులను 45 రోజుల్లో పరిష్కరించేందుకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నత కార్యాలయానికి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. మరోవైపు విద్యుత్ డీఈ కార్యాయలంలో నిర్వహించిన పరిష్కార వేదికలో మొత్తం 62 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లపై ఫిర్యాదు రాగా మిగతావి మీటర్లు, విద్యుత్ బిల్లుల హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ మెంబర్ మాతృనాయక్, డీఈ భానుప్రసాద్, ఏడీఈ శంకర్ నాయక్, పట్టణ ఏఈ రఘువీర్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మంచి మనసును చాటిన సరళమ్మా సాయం