హస్తం గెలుపులో… మనోహర మంత్రం..!
– అభ్యర్థుల గెలుపులో చాటిన చాణిక్యత
– ఎలాంటి ఆర్బాటాలు లేకుండా గెలుపులను ఏకపక్షం
– ఎమ్మెల్యే బీఎంఆర్ పోలిటికల్ మైండ్ గేమ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో అతి పెద్ద మున్సిపాల్టీ అయిన తాండూరును హస్తగతం చేసుకునేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వేసిన పాగా మంత్రం పారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల గెలుపులో ఎమ్మెల్యే రాజకీయ చాణిక్యతను చాటుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున హంగులు, హర్బాటాలు చేసినా చెదరక.. బెదరక.. క్లైమాక్స్‌లో అభ్యర్థుల విజయాలతో గట్టి చేతి గుర్తుతో గట్టి పంచ్ ఇచ్చేశారు.

తాండూరు మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన కృషిని అందరు కొనియాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయ పరిణాలు మారాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు అలాంటిది మరి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను చాటేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకుడుని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికి.. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలోకి దూకేశారు. ఎన్నికల ప్రచారం నుంచే బీఆర్ఎస్ పార్టీ ప్రచార దూకుడును కొనసాగించింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎలాంటి హడావుడి లేకుండా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు తాండూరు పర్యటనకు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఊపు పెరగలేదు.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు తాండూరులో కేటీఆర్ రోడ్ షో నిర్వహించి ఆ పార్టీ అంచనాలు పెంచినా.. సైలెంట్ స్కెచ్‌లు వేస్తూ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేశారు. హంగులు, ఆర్బాటాలతో వచ్చే ఉపయోగాలకన్నా.. అభ్యర్థులు ఎలా అయితే గెలుస్తారో అని ఆలోచించి.. అటువైపు అడుగులు వేస్తూ పార్టీ అభ్యర్థులను విజయం వైపు నడిపించారు. ఫలితంగా పట్టణంలోని 36వ వార్డుల్లో 19 స్థానాలను గెలిపించేశారు. బల్దియా పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చాటుకున్న రాజకీయ చాణిక్యతను పలువురు కొనియాడుతున్నారు. తాండూరులో దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన నేత కన్నా.. అదే నేతను చిన్న వయస్సులో ఓడించిన నేత కన్నా.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పోలిటికల్ రూటూ వేరీ స్పెషల్ అంటూ కితాబిస్తున్నారు. మొత్తానికి మున్సిపల్లో హస్తం అభ్యర్థులు గెలవడానికి మనోహర్ రెడ్డి వేసిన మంత్రం పారి పగ్గాలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది.


