తోపులాటపై పోలీసు శాఖ సీరీయస్..!
– పలువురు నాయకులపై కేసులు..?
– తాండూరులో చర్చనీయాంశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద జరిగిన తోపులాటపై పోలీసు శాఖ సీరీయస్ అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పలువురు రాజకీయ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 36వ వార్డుకు సంబంధించిన ఓట్ల లెక్కింపును పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఓట్ల లెక్కింపు ముగింపు దశలో ఉండగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేంద్రానికి చేరుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కసారిగా పెద్దసంఖ్యలో రావడంతో స్కూల్ గేటు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు, నేతల మద్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు కూడా దిగారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సీఐలు సంతోష్ కుమార్, ప్రవీణ్ కుమార్‌లు ఎస్ఐలు, సిబ్బందితో కలిసి వారిని బయటకు తరలించారు. అయితే పోలీసులు, నేతల మద్య జరిగిన వాగ్వివాదం రచ్చరచ్చగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు సీరీయస్‌గా తీసుకుని తోపులాటకు కారకులు అయిన వారిపై పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


