తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోండి

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోండి
– షాబాద్, లైమ్‌ స్టోన్‌లను మైనర్ మినరల్‌లో ఉండేలా చూడండి
– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కలిసిన క్వారీ, స్టోన్‌ అసోసియేషన్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని తాండూరు మండల క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్, తాండూరు స్టోన్ మర్చంట్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు.

ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ సమక్షంలో క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు రవూఫ్‌ ఆధ్వర్యంలో అసోసియేషన్ల ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఇటీవల లైమ్ స్టోన్ స్లాబ్స్‌ను మైనర్ మినరల్ నుండి మెజర్ మినరల్‌గా వర్గీకరించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని లైమ్ స్టోన్/షాబాద్‌/ నాపా స్లాబ్ క్వారీ లీజ్ హోల్డర్లతో పాటు ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో వ్యాపారులు ఇబ్బందలు పడుతున్నారని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా తాండూరులోని వ్యాపారులు అర ఎకరం నుండి 1 ఎకరం వరకు ఉన్న పట్టా భూముల్లో సంప్రదాయంగా లైమ్ స్టోన్ స్లాబ్ క్వారీలను నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారని వివరించారు.

ఈ పరిశ్రమపై సుమారు 20వేల నుంచి 30వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే లైమ్ స్టోన్ స్లాబ్స్‌ను మెజర్ మినరల్‌గా వర్గీకరించడం వల్ల చిన్న క్వారీ యజమానులు తీవ్ర పరిపాలనా, సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ప్రధానంగా పెద్ద స్థాయి గనుల కార్యకలాపాల కోసం రూపొందించబడినవే అని అన్నారు. ఈ విధానం వల్ల చిన్న క్వారీ యజమానులు నష్టపోతున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో నిర్మాణ అవసరాలకు ఉపయోగించే షాబాద్‌, లైమ్ స్టోన్ స్లాబ్స్‌ను ఇప్పటికీ మైనర్ మినరల్ కేటగిరీలోనే కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. తాండూరు పరిశ్రమను కూడా మైనర్ మినరల్‌ కేటగిరిలోనే కొనసాగింఏ విధంగా చూడాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని అబ్దుల్ రవూఫ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ సోమాని, మొహమ్మద్ అన్వర్ అహ్మద్, కోశాధికారి మొహమ్మద్ జైనుద్దీన్ తదితరులు ఉన్నారు.

రోహిత్ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి