దేవుడా.. ఇదేం గుండె కోతయ్యా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దేవుడా.. ఇదేం గుండె కోతయ్యా..!
– తండ్రికి కొరివి పెడుతూ తల్లడిన పసి హృదయం
– గుండెపోటుతో కన్నుమూసిన ఉపాధ్యాయుడికి వీడ్కోలు
– అంత్యక్రియల్లో హృదయ విదారకరమైన దృశ్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తండ్రి గుండెలపై ఇప్పుడిప్పుడే ఎదిగిన పసి హృదయం తల్లడిల్లిన సంఘటన ఇది. గుండెపోటుతో కన్నుమూసిన తండ్రికి తన చిట్టి చేతులతో తల కొరివి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గుండెలవిసేలా ఏడుస్తూ తండ్రికి కొరివి పెట్టిన కొడుకును చూసిన వారంతా దేవుడా ఇదేం గుండె కోత అయ్యా అంటూ దైవాన్ని నిందించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరుకు చెందిన ప్రభుత్వ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, తెలంగాణ ఉద్యమ కారుడు దూస శ్రీనివాస్ శుక్రవారం ఉదయం విధులకు వెళుతుండగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. శ్రీనివాస్ తో పాటు ఆయన సతీమణి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది.

వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీనివాస్ అకాల మరణం చెందడంతో తాండూరులో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. పదేళ్ల వయసులో ఉన్న శ్రీనివాస్ కుమారుడు సాయి చేత తండ్రికి అంతిమ సంస్కారాలు చేయించారు. పాడె ముందు చిన్నారి సాయి నడుస్తూ అంత్యక్రియల్లో తండ్రికి కొరివి పెట్టాడు. తల్లడిల్లిన హృదయంలో తండ్రికి కొరివి పెట్టిన దృశ్యాలు చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఉపాధ్యాయులు అందరు కన్నీటి పర్యంతం అయ్యారు. శోక సముద్రంలోనే శ్రీనివాస్‌కు అంతిమ వీడ్కోలు పలికారు.

తిరగబడిన పాత తాండూరు..!