తీన్మార్.. పంచాయతీ..!
– ఒకే జీపీకి మూడు జాతీయ అవార్డులు
– రేపు మంత్రుల చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు
– జిల్లాలోని గౌతాపూర్ గ్రామానికి దక్కిన గౌరవం
– హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచ్ రాజప్ప గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని కర్ణాటక రాష్ట్రానికి చేరువలో ఉన్న గ్రామం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గం తాండూరు మండలంలోని గౌతాపూర్ గ్రామ పంచాయతీ తీన్మార్ అవార్డులను దక్కించుకుంది. మొన్న మండల స్థాయి, నిన్న జిల్లా స్థాయి, రేపు రాష్ట్ర స్థాయి జాతీయ అవార్డులను అందుకోబోతుంది. ఉత్తమ సేవలు అందిస్తున్న పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందజేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పంచాయతీలు అవార్డులను పొందుతున్నాయి. ఈ క్రమంలో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీ కూడ జాతీయ అవార్డులను పొందింది. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం, పచ్చదనం, హరితహారం, నర్సరీల వంటి వాటి అమలులో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. దీంతో తాండూరు మండలంలో ఉత్తమ సుపరిపాలన పంచాయతీ విభాగంలో మండల స్థాయి అవార్డుతో పాటు జిల్లా స్థాయి అవార్డులను దక్కించుకుంది. రేపు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో జాతీయ అవార్డును కూడ దక్కించుకుంటుంది.
అందరి తోడ్పాటుతోనే : సర్పంచ్ రాజప్ప గౌడ్
తాండూరు మండలంలోని గౌతాపూర్ గ్రామ పంచాయతీ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీగా జాతీయ అవార్డులను దక్కించుకోవడం ఎంతో హర్షణీయం.
గ్రామ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితారెడ్డిలతో పాటు గ్రామ కార్యదర్శి ఫక్రోజీ, వార్డు సభ్యులు, యువజన సంఘాలు, ఉపాధ్యాయులు, అంగన్వాడి, ఆశ, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల అందరి తోడ్పాటుతో ఇది సాధ్యమైంది. ఇందుకు సహకరించిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు.

