రేషన్ కార్డు ఉంటే చాలు..!
– ప్రతి కుటుంబానికి రూ. 5లక్షలు
– తెలంగాణ సర్కారు కొత్త పథకం
– అర్హతలు, నిబంధనలు ఇవే..
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పేదలకు దగ్గరవుతోంది. రానున్న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా సర్కారు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది.

ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5లక్షలు అందించే విధంగా కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే ఇందిరమ్మ పేరుతో పథకాలను అమలు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ కుటుంబ బీమా అనే పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్దమైంది. ఇప్పటికే విధివిధానాలు దాదాపుగా ఖరారు అయ్యాయి. పథకం ఎవరికి వర్తింపచేయాలి..? అర్హతలు ఏంటి? ఎలా అమలు చేయాలి? అనేదానిపై తుది నిర్ణయానికి వచ్చారు.

అయితే బడ్జెట్లో ఈ పథకానికి ఇప్పటికే రూ.4 వేల కోట్ల కోటాయింపు జరిగింది. 1.15 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డు ఉండగా.. వీరి తరపున రూ.3,509 వార్షిక ప్రీమియంను ప్రభుత్వం ఒకేసారి ఇన్యూరెన్స్ కంపెనీలకు చెల్లించనుంది. ఒక్కొ కుటుంబానికి రూ.3,509 చొప్పున ప్రీమియం అవుతుందని తెలుస్తోంది.
ప్రత్యేక యాప్‌తో వివరాల సేకరణ
ప్రభుత్వం ప్రారంభించే పథకంలో అర్హులైనవారి వివరాలను నమోదు చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారిని గుర్తించి సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో కుటుంబసభ్యుల వివరాలు సేకరించి డిజిటల్ డేటా బేస్ సిద్దం చేయనున్నారు.

పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, మున్సిపల్ వార్డు అధికారులకు సర్వే బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వివరాలను సేకరించనున్నారు. ఎలాంటి రాజకీయ జోక్యానికి సంబంధం లేకుండా పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.
ఖాతాలోకే డబ్బుల జమ
ఈ పథకం కింద పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తారు. కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకున్న పది రోజుల్లోనే నామినీ అకౌంట్లో నేరుగా జమ అవుతాయి.

ఇందుకోసం బ్యాంకింగ్ చానెళ్లను అనుసంధానించనున్నారు. బీమా క్లెయిమ్ చేసుకునేందుకు కుటుంబసభ్యులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా క్లెయిమ్ చేసుకున్న వెంటనే క్లియరెన్స్ ఇచ్చేలా సింగిల్ విండో విధానం పాటించనున్నారు.
లబ్దిదారుల అర్హతలు ఇవే
– రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి, 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి, కుటుంబంలో కోరినవారి పేరు మీద పాలసీ చేసే అవకాశం, కుటుంబసభ్యుల అభిష్టం మేరకు యజమాని లేదా కుటుంబసభ్యుల పేర్లపై పాలసీ తీసుకోవచ్చు. నామినీకి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.


