పోయిరావయ్య.. గణపయ్య..!
– తాండూరులో వేడుకగా మొదలైన మహా నిమజ్జనం
– వీడ్కోలు పలికిన నేతలు, భక్తులు
– వేడుకల్లో చీఫ్ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఐదు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథులు శుక్రవారం నిమజ్జనానికి తరలివెళ్లారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్’ అంటూ భక్తుల నినాదాలతో తాండూరు పట్టణం మార్మోగింది.

మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. వివిధ మండపాల నుంచి గణనాథులను అలంకరించి భారీ శోభాయాత్రలతో తరలించారు. భద్రేశ్వర చౌరస్తా మీదుగా సాగిన ఊరేగింపులో యువత కేరింతలు, నృత్యాలతో సందడి చేసింది. ఐదు రోజులుగా తమ ఇళ్లలో, మండపాల్లో కొలువుదీరిన గణపయ్యకు భక్తులు భావోద్వేగంతో వీడ్కోలు పలికుతూ నిమజ్జనంకు తరలిస్తున్నారు.

తాండూరు పట్టణంలో జరిగిన నిమజ్జన వేడుకల్లో చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రేశ్వర చౌక్ వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికల వద్ద నిమజ్జనానికి తరలివచ్చిన గణనాథులకు స్వాగతం పలికారు.

పాత తాండూరు కోట సమీపంలో, భద్రేశ్వర చౌరస్తాలో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి ప్రతి వినాయక మండపానికి స్వాగతం పలికారు. నిమజ్జనానికి తరలివెళ్లే గణనాథులకు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి.

నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన కూడళ్లు, శోభాయాత్ర మార్గాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ చైర్మన్లు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల బాల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు రాజుగౌడ్, మురళీగౌడ్, హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, ఉపాధ్యక్షులు అష్టికర్ ఆశీష్, కోశాధికారి అంతారం కిరణ్, పర్యాద రామకృష్ణ, దేవగారి రమేస్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


