బొజ్జ గణపయ్యపై బీఎస్ఆర్ భక్తి..!
– వాడవాడలా కొలువుదీరిన గణనాథుల దర్శనం
– మండపాల్లో గజ ముఖునికి ప్రత్యేక పూజలు
– బైక్‌పై పురవీధుల్లో పర్యటిస్తూ భక్తులతో సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలో కొలువుదీరిన గణనాథులను దర్శించుకుంటూ తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బీఎస్ఆర్) భక్తిని చాటుకున్నారు. పట్టణంలోని వాడవాడలా ఏర్పాటైన వినాయక మండపాలను సందర్శించి, గజముఖుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుధవారం రాత్రి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను బీఎస్ఆర్ దర్శించుకున్నారు. ఒక్కో మండపం వద్దకు వెళ్లి నిర్వాహకులు, భక్తులను పలకరిస్తూ ఉత్సవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

వినాయక మండపాల వద్దకు చేరుకున్న బీఎస్ఆర్కు నిర్వాహకులు, స్థానికులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. భక్తులతో కలిసి కొద్దిసేపు గడిపిన ఆయన ఉత్సవాల సందడిలో భాగమయ్యారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలకు తావివ్వకుండా సామాన్యుడిలా బైక్‌పై పట్టణంలోని పురవీధుల్లో పర్యటిస్తూ వినాయక మండపాలను సందర్శించడం స్థానికులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బుల్లెట్ బైక్‌పై వీధుల్లో పర్యటిస్తూ భక్తులను పలకరిస్తూ ముందుకు సాగారు.

వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని బీఎస్ఆర్ ఆకాంక్షించారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాలను అందరూ ఐకమత్యంతో నిర్వహించుకోవాలని కోరారు.

బీఎస్ఆర్ పర్యటన సందర్భంగా పలు మండపాల వద్ద యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ నాయకులు పటేల్ కిరణ్ కుమార్, బంటు మల్లప్ప, రొంపల్లి సంతోష్ కుమార్, కౌన్సిలర్లు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


