మ్యాజిక్ చూద్దాం రండి..!
– నేడు తాండూరులో అద్భుత ఇంద్రజాల ప్రదర్శన
– గ్రేన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాల సందడి కొనసాగుతున్న వేళ తాండూరు పట్టణ ప్రజలను అలరించేందుకు ది గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అద్భుత ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించనున్నారు.

ప్రజలకు వినోదంతో పాటు ఇంద్రజాల కళను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. పట్టణంలోని నెహ్రూ గంజ్ ఆవరణలో రాత్రి 8 గంటలకు ఇంద్రజాల ప్రదర్శన ప్రారంభం కానుంది. ప్రముఖ ఇంద్రజాల కళాకారుడు మాయారతి జోష్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగనుంది.

ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసే పలు ఇంద్రజాల విన్యాసాలతో పాటు ప్రత్యేక ప్రదర్శనలు ఉండనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రజాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

చిన్నారులు, యువతతో పాటు కుటుంబ సమేతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై ఇంద్రజాల ప్రదర్శనను తిలకించి విజయవంతం చేయాలని ది గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.


