తాండూరు ఈద్గా, మసీదులకు మహర్థశ..!
– రూ. 1కోటి నిధులతో అభివృద్ధి
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– సన్మానించిన ఈద్గా ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలోని ఈద్గా, మసీదులకు మహర్ధశ తీసుకరావడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

పట్టణంలోని చెన్‌గేస్‌పూర్ రోడ్డులో ఉన్న ఈద్గా పరిరక్షణకు ప్రహరీగోడ నిర్మాణం కోసం మంజూరైన రూ.35 లక్షలతో చేపట్టనున్న పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీల ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈద్గా పరిరక్షణతో పాటు మసీదులు, కబ్రస్తాన్ల అభివృద్ధికి ప్రభుత్వం దాదాపు రూ. 1కోటి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మంజూరైన నిధులతో చేపడుతున్న ప్రహరీగోడ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మైనారిటీ ప్రార్థనా స్థలాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ఈద్గా అధ్యక్షుడు యూసుఫ్‌ఖాన్, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ చైర్మన్లు బాల్‌రెడ్డి, నర్సింహులు, కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు, ఈద్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


