ఏటీసీతో ఉపాధి బాటలు..!
– నైపుణ్య విద్యను సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– కేంద్రాన్ని సందర్శించి.. ఆరా తీసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏటీసీ నైపుణ్య ఆధారిత విద్యతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.

గురువారం తాండూరు పట్టణంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. వివిధ కోర్సుల్లో శిక్షణ ఎలా కొనసాగుతోంది, బోధనా విధానం ఎలా ఉంది, విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఏటీసీల్లో అందిస్తున్న సాంకేతిక విద్య ద్వారా శిక్షణ పొందిన వారికి వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే వివరించారు. కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా, శిక్షణలో నేర్చుకునే నైపుణ్యాలను ఆచరణలో పెట్టేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మనోహర్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు, కాలేజీ అధ్యాపక, సిబ్బంది తదితరులు ఉన్నారు.


