కుమ్మరి బిచ్చమ్మ ఇంటికి కుంపటి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కుమ్మరి బిచ్చమ్మ ఇంటికి కుంపటి..!
– విద్యుత్‌ వైర్ల మంటలకు ఇల్లు దగ్ధం
– ఆదుకోవాలని తహసీల్దార్‌కు వేడుకోలు
యాలాల, దర్శిని ప్రతినిధి : కుండలు చేసి కుటుంబాన్ని పోషించుకునే ఆ కుమ్మరి కుటుంబంపై విద్యుత్‌ వైర్లు కుంపటి రాజేశాయి. మంటలు ఇంటిని దహించడంతో అన్ని బుగ్గిపాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలం రాస్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కుమ్మరి బిచ్చమ్మకు ఈ దుస్థితి ఎదురైంది.

బిచ్చమ్మ నివాసముంటున్న పాత ఇంటిపై నుంచి వెళ్లే విద్యుత్‌ వైర్లు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగాయి. ఆ నిప్పురవ్వలు ఇంటిపై ఉన్న కాగితాలపై పడటంతో మంటలు వేగంగా వ్యాపించి ఇంటి వాసాలకు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించి ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే తీవ్ర ఆస్తినష్టం జరిగింది.

కుమ్మరి వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బిచ్చమ్మకు ఈ ఘటనతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. రెక్కల కష్టంతో కూడబెట్టుకున్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతి కావడంతో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. జీవనాధారమైన కులవృత్తిపై ఆధారపడి బతుకుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని బిచ్చమ్మ వేడుకుంటోంది.

ఇల్లు దగ్ధమై తీవ్రంగా నష్టపోయిన తనకు ప్రభుత్వ పరంగా పరిహారం అందించి ఆదుకోవాలని మండల తహసీల్దార్‌ను ఆమె కోరింది. నిరుపేద కుటుంబాన్ని అధికారులు పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందించాలని గ్రామస్థులు సైతం కోరుతున్నారు.

జిల్లాల ఏర్పాటు కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనం