పీపుల్స్ డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు..!
– ఆటపాటలతో అంబరాన్నంటిన ఉత్సాహం
– సందడి చేసిన విద్యార్థులు, అధ్యాపకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు.

కళాశాల ప్రాంగణం బతుకమ్మ పాటలతో మార్మోగింది. విద్యార్థినులు సంప్రదాయ పద్ధతిలో వేడుకల్లో పాల్గొని పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి కాగ్నా నదిలో నిమజ్జనం చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో మన సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు ఐక్యతాభావాన్ని పెంచుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


