ప్రజారోగ్యానికి ప్రాధాన్యం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం..!
– ఆసుపత్రుల అభివృద్ధికి రూ.4 కోట్లు
– వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి
– రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఎంసీహెచ్‌, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరులోని ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

గురువారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఆయన వైద్యులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా ఆసుపత్రుల్లోని పరిస్థితులను తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే రోగులకు అందుతున్న చికిత్సలు, వైద్యుల స్పందన, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వైద్యులు సమయానికి విధులకు హాజరవుతున్నారా? రోగులకు అవసరమైన సేవలు సకాలంలో అందుతున్నాయా? అనే అంశాలపై అధికారులతో చర్చించారు.

విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఐసీయూ యూనిట్‌ను పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరైన నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించడం వైద్యులు, సిబ్బంది బాధ్యత అని అన్నారు. విధుల్లో సమయపాలన పాటించాలని, రోగులతో మర్యాదగా వ్యవహరించి వారికి భరోసా కల్పించాలని సూచించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావివ్వకుండా ప్రజారోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌, డీసీహెచ్‌ఎస్‌ ఆనంద్‌కుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజాక్‌ మాలిక్‌, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Pvr

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు..!