స్మశాన వాటిక సంరక్షణపై సమరశంఖం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

స్మశాన వాటిక సంరక్షణపై సమరశంఖం
– రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం
– దళిత ఎస్సీ వెల్పేర్ సోసైటి తీర్మానం
– కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలకు డిమాండ్
– తాండూరు పట్టణ పోలీసులకు మరోసారి ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఎస్సీ స్మశాన వాటిక సంరక్షణకు దళిత ఎస్సీ వెల్ఫేర్‌ సొసైటీ సమరశంఖం పూరించింది.

పట్టణంలోని జగన్మాత ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో స్మశాన వాటిక భూముల ఆక్రమణ ఆరోపణలు, స్మశానాల ధ్వంసం ఘటనలపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ శక్తులు అడ్డువచ్చినా వెనక్కి తగ్గకుండా, పార్టీలకు అతీతంగా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రతినబూనారు.

తాండూరు పట్టణంలోని సర్వే నంబర్‌ 3లో ఎస్సీ స్మశాన వాటిక స్థలం విషయంలో వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. సమద్‌ అనే వ్యక్తి యంత్రాలతో రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని సొసైటీ సభ్యులు పేర్కొన్నారు. దళితుల స్మశాన వాటిక స్థలాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి వ్యవహారాలపై అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సొసైటీ సభ్యులు మరోసారి తాండూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి స్మశాన వాటిక భూముల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

అనంతరం పలువురు మాట్లాడుతూ స్మశానాల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని సభ్యులు తప్పుబట్టారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, స్మశాన వాటిక భూముల పరిరక్షణకు అధికారులు స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని, ఇలాంటి ఘటనలపై నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జుంటుపల్లి వెంకట్, దివిటి ఎల్లప్ప, కోఆప్షన్ సభ్యులు సుభాష్‌, సోసైటి నాయకులు, సభ్యులు తదితరులు ఉన్నారు.

Pvr

అమ్మవారి సేవలో బుయ్యని సరళారెడ్డి..!