మళ్లీ అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఇండ్లు
– ఈ వేలం వేసేందుకు కసరత్తు
– ప్రక్రియను వేగవంతం చేసిన జిల్లా కలెక్టర్
– ప్రణాళికలు పూర్తి చేయాలని ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహ ఇండ్లు మళ్లీ అమ్మకానికి సిద్దమయ్యాయి. గతంలో బహిరంగా వేలం ద్వారా విక్రయాలు నిర్వహించగా.. మిగిలిన ఇండ్లకు మళ్లీ ఈ వేలం ద్వారా స్వగృహ ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఆధ్వర్యంలో చర్యలు వేగవంతమయ్యాయి. మద్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వమే అపార్టుమెంట్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద తాండూరులో మనోహ టౌన్ షిఫ్ ఆధ్వర్యంలో మొత్తం 173 ఇండ్లను నిర్మించింది. ఇందులో కొన్ని పూర్తికాగా, మరికొన్ని ఇప్పటికి నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే 173 ఇండ్లలో 101 వరకు కొనుగోలు చేసిన వారికి అప్పగించారు. గతంలో ఈ 101లో కొన్ని ఇండ్లకు బహిరంగ వేలం నిర్వహించి.. మరీ అప్పగించారు. ప్రస్తుతం తాండూరులోని రాజీవ్ స్వగృహలో 72 ఇండ్లు ఉన్నాయి. రాజీవ్ స్వగృహా పథకం ప్రభుత్వానికి భారంగా మారడంతో ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది.
సందర్శించిన జిల్లా కలెక్టర్
ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ఉన్న రాజీవ్ స్వగృహా ఆస్తులను విక్రయించే బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది.
దీంతో గురువారం తాండూరులోని రాజీవ్ స్వగృహ ఇండ్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సందర్శించి పరిశీలించారు. మొత్తం ఇండ్లు ఎన్ని ఉన్నాయి.? విక్రయానికి ఎన్ని ఉన్నాయి..? అనే వివరాలను మనోహా టౌన్షిప్ ప్రతినిధులతో ఆరా తీశారు. మిగిలిన ఇండ్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదే శించారు.
పారదర్శకంగా ఇండ్ల విక్రయాలు
రాజీవ్ స్వగృహలోని ఇండ్లను పారదర్శంగా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వగృహలోని ఇండ్లను ఆన్లైన్లో పొందుపరించింది. దీంతో దీంతో ఇండ్లను విక్రయించేందుకు ఈ-వేలం వేయాలని నిర్ణయించింది.
ఇండ్లను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్న వారు వెబ్సైట్లోకి లాగిన్ అయి తమ పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇంకా ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సహాయ కేంద్రంలో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.

