జిల్లా ఆసుపత్రికి చేయూత
– రూ.5లక్షల విలువైన పరికరాలు
– అందజేసిన సీసీఐ సీఎండీ సంజయ్ బంగా
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సీసీఐ కర్మాగారం ద్వారా చేయూత అందింది. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీసీఐ కర్మారాగాల సీఎండీ సంజయ్ బంగా ఆసుపత్రికి సహాకారం అందించారు. శనివారం సీసీఐ సీఎండీ సంజయ్ బంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో పేదలకు అందిస్తున్న సేవల గురించి, ఆసుపత్రిలో వసతుల గురించి ఆరా తీశారు.

ఈ సందర్భంగా సీసీఐ సీఎండీ సంజయ్ బంగా సహాకారంతో ఆసుపత్రికి రూ.5లక్షల విలువైన పరికరాలను అందజేశారు. ఇందులో మానిటరింగ్ కిట్, ఈసీజీ, రిఫ్రిజిరేటర్ తో పాటు మరికొన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎండీ సంజయ్ బంగా మాట్లాడుతూ సీసీఐ ద్వారా సామాజిక సేవకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి పురోగతికి తమవంతు సహాకారం అందిస్తామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీసీఐ ద్వారా ఆసుపత్రికి చేయూత అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు సీసీఐ కర్మాగారాలలో స్థానిక యవతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీసీఐ జీఎం శరత్ కుమార్, హెచ్ఎర్ అమిత్ రంజన్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, ఆసుపత్రి సూపరిడెంట్ డా.రవి శంకర్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రాజు, ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, నాయకులు, కర్మాగారం ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

