రోడ్డుపై నడిచే రైలు..!
– విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయోగం
– తెలంగాణలోని ఓ జిల్లాలో సందడి
దర్శిని డెస్క్: ఇప్పటి వరకు మనం పట్టాలపై నడిచే రైళ్లను మాత్రమే చూసుంటాం. అప్పుడప్పుడు పార్కుల్లోనో.. జాతర ఉత్సవాల్లోనో చిన్నపాటి రైళ్లను చూసి ఉంటాం. ఎప్పుడైనా రోడ్డుపై నడిచే రైలును చూశారా..? అవునండి పట్టాలపై నడిచే రైలు కాదు.. రోడ్డుపై నడిచే రైలు గురించే అడిగేది. కాని తెలంగాణ రాష్ట్రంలోని ఓ జిల్లాలో రోడ్డుపై నడిచే చిన్న రైలు సందడి చేస్తోంది. రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా ప్రజలకు రైలు ప్రయాణం కల. అయితే కొన్నేళ్లుగా ఆ కల కలగానే మిగిలిపోయింది. అయితే వీరి కల నెరవేరుస్తూ బైంసాలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం రహదారులపై రైలును పరుగులు పెట్టించారు.
విద్యార్ధులకు మానసిక ఆనందం, వాహనాలపై అవగాహన కల్పించడానికి నిర్మల్ జిల్లా భైంసా ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఈ రైలులాంటి వాహనంలో విద్యార్థులను ఎక్కించుకొని నగర వీధుల్లో తిప్పుతున్నారు. అచ్చం రైలులా కనిపించే ఈ వాహనానికి ముందు ఇంజిన్, వెనుక 3 బోగీలు ఏర్పాటు చేసారు. అయితే ఈ వాహనానికి కార్లకు ఉండే చక్రాలు అమర్చడంతో దీనికి పట్టాలు అవసరం లేదు. ఈ వాహనం ఇప్పుడు భైంసా పట్టణంలోని రహదారులపై రైలు పరుగులు పెడుతూ సందడి చేస్తుంది. అది చూసి పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను క్రింద చూడండి.

