ఆధునిక పద్దలతో అధిక దిగుబడులు
– వ్యవసాయ శాస్త్ర వేత్త డా. సుధారాణి
– శాస్త్ర వేత్త సూచనలు పాటించాలి : రైతు బాల్ రెడ్డి
– పరిశోధన స్థానంలో ఘనంగా విత్తన మేళా
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆధునిక పద్ధతులు అవలంభించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తాండూరులోని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు సూచించారు. మంగళవారం పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.సి. సుధారాణి ఆధ్వర్యంలో విత్తనమేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరుకు చెందిన ప్రముఖ రైతు సాయిపూర్ పట్లోళ్ల బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కంది సాగులో మెళకువలు పాటించడం ముఖ్యమని సూచించారు. విత్తనం ఎంపికలో రైతులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా నూతన పద్ధతులు పాటించాలని సూచించారు. అదేవిధంగా ప్రధాన శాస్త్రవేత్త డా.సి.సుధారాణి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా.ప్రవీణ్ తదితరులు మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. జంట సాళ్ల పద్ధతి, విత్తన శుద్ధి, అంతర పంటలు, యాంత్రీకరణ, డ్రోన్ల ఉపయోగం వంటి పద్ధతుల సాగుతో అధిక దిగుబడులు సాధిస్తారని అవగాహన కల్పించారు.
అనంతరం పరిశోధన స్థానం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ సీడ్స్ టీడీఆర్జీ-24, టీడీఆర్జీ-59, ఆశ రకాల విత్తనాలను ఒక్క ప్యాకెట్ ను రూ. 520ల చొప్పున రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డా. సందీప్, డా. మిన్ని, డా.యమున, ఏఈఓ హరీష్ చందర్, రమేష్ చంద్రుడు, సోమ్లా, వివిధ ప్రాంతాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

