అగ్నిపథ్‌పై అప్రమత్తం
– జిల్లాలోని రైల్వేస్టేషన్లలో బందోబస్తు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసువస్తున్న అగ్నిపథ్ ఆందోళనలు రాష్ట్రంలో మొదలు కావడంతో రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరులో రైల్వే స్టేషన్లలో గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు. శుక్రవారం ఉదయం సికింద్రబాద్ రైల్వే స్టేషన్, బస్ బస్టేషన్ల వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో రైల్వే పోలీసులు, పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వేస్టేషన్ల వద్ద పోలీసులను ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త అప్రమత్త చర్యలను చేపట్టారు. వికారాబాద్, తాండూరు రైల్వేస్టేషన్లలో పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఆయా స్టేషన్ల వద్ద పోలీసు సిబ్బంది ఆందోళన కారుల పట్ల ప్రత్యేక దృష్టిని సారించారు. వికారాబాద్‌లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు బందోబస్తు చర్యలను చేపట్టగా తాండూరులో డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ నేతృత్వంలో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద బందోబస్తులో పాల్గొన్నారు. తాండూరులో పరిస్థితిని డీఎస్పీ శేఖర్ గౌడ్ ఎప్పటికప్పుడు సమీక్షించారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి స్టేషన్‌ను సందర్శించి పరిస్థితిని ఆరా తీశారు.



