తరాల అభివృద్ధి చేసిన మేమే..!
– పనికిరాని విమర్శలు పట్టించుకోం
– అభివృద్ధి మంత్రంతోనే ముందుకు సాగుతాం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– బషీరాబాద్ మండలంలో పల్లె పల్లెకు పట్నం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజల ఆదరణతో నియోజకవర్గంలో తరాలు గుర్తించే అభివృద్ధి చేయడం జరిగిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పల్లెపల్లెకు పట్నం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బషీరాబాద్ మండలంలో మైల్వార్, తాండా పలు గ్రామాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజల ఆశీర్వాదంతో 1994 నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు. మంత్రిగా ఉన్న సమయంలోనే నియోజకవర్గంలో రూ. 1800 నుంచి రూ. 2వేల కోట్ల వరకు అభివృద్ధి పనులను సాధించడం జరిగిందన్నారు. హైదరాబాద్ మార్గంలో బ్రిడ్జిలు, కాగ్నా బ్రిడ్జి, జీవన్గీ బ్రిడ్జిలు సాధించడమ జరిగిందన్నారు. తాండూరు ప్రాంతాల్లో మహేందర్ రెడ్డి అంటే తరాలు గుర్తించుకునే అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే సాధించిన పనులు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయన్నారు. అవే పనులను కొందరు చేపడుతూ మేమే సాధించామంటూ గొప్పలు పోతున్నారని, పటాకులు పేలుస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్కడితో ఆగకుండా తనపై ఓర్వలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పనికిరాని అలాంటి విమర్శలు పక్కన పెడతామని, అభివృద్ధి మంత్రంతోనే ముందుకుసాగుతామని పేర్కొన్నారు. ఓర్వలేని విమర్శలు చేసే నాయకులను ప్రజలు అంతా గమనిస్తున్నారని, వాళ్లే అంతా చూసుకుంటారని అన్నారు. రానున్న రోజుల్లో కూడ ఎమ్మెల్సీ, జెడ్పీ, ఎంపీ నిధులతో తాండూరు అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



