ఫస్ట్ చోరీకి పక్కా ప్లాన్..!
– ఫ్రెండ్స్‌తో కలిసి అమలు
– సక్సెస్ ఫుల్‌గా రూ. 20ల లక్షలు లూటీ
– చెత్త డబ్బాలో.. సీసీ కెమెరాలతో చిక్కన వైనం
– భారీ చోరీ కేసును చేధించిన పోలీసుల
– వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : డబ్బుల కోసం ఆశపడి ఫస్ట్ చోరీకి ప్లాన్ చేశారు. ఇద్దరు ప్లాన్ చేసి.. ముగ్గురిని కలుపుకుని తెలిసిన ఇంట్లోనే కన్నం వేశారు. దోచేసిన సొమ్మును చెత్త డబ్బాలతో దాచి పరారయ్యారు. సీసీ కెమెరాలకు చిక్కి.. జైలు వెనక్కి వెళ్లారు. ఈనెల 15న తాండూరు పట్టణంలో జరిగిన భారీ చోరీని పోలీసులు చేధించారు. బుధవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరై కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అల్గారి మజీద్ సమీపంలోని ఆర్టీఐ కన్సల్ టెంట్ వాజీద్ ఈనెల 13న హైదరాబాద్లో జరిగిన వివాహానికి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూసే సరికి ఇంట్లోని బీరువాలో సుమారు రూ. 20 లక్షలు చోరీ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
చోరీకి ప్లాన్.. ఇలా జరిగింది
వాజిద్ కు ముందు నుంచి అబ్బుకార్ ఖురేషీ (21) పరిచయం ఉంది. వాజిద్ దగ్గర అబుబకార్ కొన్ని రోజులు పనిచేశాడు. వాజిద్ దగ్గర ఫ్లాట్ అమ్మిన డబ్బులు సుమారు రూ.20లక్షలకు పైగా ఉన్నట్లు ముందునుంచి తెలుసు. వాటిని కాజేసేందుకు అబ్బుకార్ తన పెద్దమ్మ కుమారుడు అబిసోఫియాన్(25)తో కలిసి ప్లాన్ చేశారు. ఈప్లాన్ లో తాండూరుకు చెందిన ఎండి ఖలీల్, పాత తాండూరుకు చెందిన తౌసిఫ్, ఇందిరమ్మ కాలనీకి దారుమళ్ల దీపక్ అలియాస్ కిట్టులను కలుపుకున్నారు. ఈనెల 13న వాజిద్ పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లినట్లు తెలుసుకున్నారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం.. అదేరోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో వద్దకు వచ్చి రిక్కీ నిర్వహించారు. మళ్లీ రాత్రి 11 గంటల తరువాత అబుబకార్, ఖలీల్ లు హీరో హోండా ఫ్యాషన్ ప్రో(ఎపీ 28 ఎఎక్స్ 8265)బైకు ఇంటి వద్దకు రాగా తౌసిఫ్, అబుసోఫియాన్, కిట్టులు ఆటోలో బ్రిడ్జి కింద ఉండిపోయారు.
సక్సెస్ పుల్‌గా చోరీ
ఇంటికి వచ్చేముందు అబుబకార్, ఖలీల్ లు రాయల్ కాంటా దగ్గర ఓ ఇనుప రాడ్ ను వెంట తెచ్చుకున్నారు. ఇంటి వెనుక నుంచి వెళ్లి రాడ్ సాయంతో ఇళ్లు తెరిచి లోపలికి వెళ్లారు. బీరువా తాళాలు అక్కడే ఉండడంతో దానిని తెరిచి అందులోని డబ్బులను ఎత్తుకుని రాడ్ తో సహా అక్కడి నుంచి పరారయ్యారు.
ఆటోలో ఉన్న తౌసిఫ్, సోఫియాస్, కిట్టులు రాయల్ కాంట నుంచి రాగా బైకుపై అబ్బుకార్, ఖలీల్ లు పాత తాండూరు మాణిక్ నగర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి పట్టణంలోని యాదిరెడ్డి చౌరస్తా సమీపంలో ఉన్న పాత బడిన 365 హోటల్ వద్దకు చేరుకున్నారు. ఇంట్లో నుంచి తీసుకవచ్చిన 500 నోట్లతో ఉన్న 40 కట్టలను లెక్కించి రూ. 20 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నుంచి రూ. 1లక్ష తీసుకుని రూ. 20 వేల చొప్పున అందరు పంచుకున్నారు. మిగతా రూ. 19 లక్షలను అక్కడే ఉన్న చెత్త డబ్బాలో దాచి ఆటో, బైకులతో పాటు చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్ తో పరారయ్యారు.
దొరికిపోయారు ఇలా..
మరుసటి రోజు వాజిద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలలో ఇంటి పరిసరాల వద్ద అసునామాస్పదంగా కనిపించిన అబుబకార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయాన్ని అంగీకరించాడు. చోరీ జరిగిన రోజు 365 హోటల్ వద్ద కలుసుకోవడం, డబ్బులు దాచి పారిపోవడం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు అబుబకార్, అబు సోఫియాన్ లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగతా వారిలో ఎండీ ఖలీల్, తౌసిఫ్, కిట్టులు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
అబుబకార్, సోఫియాన్ లపై ఎలాంటి కేసులు లేవని, మిగతా ముగ్గురిపై అల్లర్ల కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులపై సస్పెక్ట్ షీట్ తెరుస్తామన్నారు. అదేవిధంగా 72 గంటల్లో కేసును చేధించిన తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డిలను అభినందించారు. కేసు చేధనలో చాకచక్యంగా పనిచేసిన పోలీస్ కానిస్టేబుళ్లు అంజద్, శివ, షబ్బీర్, సాయిప్పలకు ఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డులను అందజేశారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఇతరుల సహాకారంతో పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణ కోసం అందరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి…


