దోమలను ఇస్తే.. పైసలిస్తాం..!
– ఆ గ్రామంలో క్రేజీ ప్రైజ్ మనీ ఆఫర్
– ఎందుకిలా చేసారో తెలిస్తే షాక్ అవుతారు
దర్శిని డెస్క్ : దోమలు అంటే ఎంత చిరాకో అందరికి తెలుసు. వాటి వల్ల కలిగే ఇబ్బందులు, వచ్చే రోగాలు తలుచుకుంటేనే చంపేయాలనంత కోపం వస్తుంది. ఇప్పుడు చెబుతున్న సంగతి తెలిస్తే అంతే కూల్ అవుతారు. ఓ గ్రామంలో దోమలు తీసుకవచ్చి ఇస్తే పైసలిస్తామని క్రేజీ ఆఫర్ ప్రకటించారు. ఇలా ఎందుకు చేస్తారు…? దాని వెనుక ఉన్న కథేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి. ఫిలిఫ్పీన్స్ రాజధాని మానీలా సమీపంలోని ఓ గ్రామంలో ఈ వినూత్న ఆఫర్‌ను పెట్టారు. అది కూడా ఏకంగా ఆ గ్రామ నాయకుడే ఈ విధంగా ఒక స్కీమ్ తీసుకొచ్చాడు.
అదేంటి ఆయనకు దోమలంటే అంత ఇష్టమా? కొంపదీసి దోమల కర్రీ ఏమైనా చేసుకొని తింటాడా అంటూ పాపం అతన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ గ్రామంలో డెంగీ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన ఈ వినూత్న ఆలోచన చేశారు. దోమల్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా.. అక్కడ దోమలు అంతం కావడం లేదు. పైగా డెంగీ జ్వరంతో ఏకంగా ఇద్దరు విద్యార్థులు ఇటీవలె మరణించారు. ఫిబ్రవరి 1 నాటికి ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 28,234 మంది డెండీ జ్వరంతో మంచం పట్టారు.
దోమల కారణంగానే డెంగీ వ్యాప్తి చెందుతుండటంతో ఎలాగైన ఈ దోమల అంతం చూడాలని మనీలా సమీపంలోని ఓ గ్రామంలో దోమలు తీసుకొస్తే ప్రైజ్‌మనీ ఇస్తామని ప్రకటించారు. ఓ ఐదు దోమలు లేదా లార్వాలకు ఒక ఫిలిప్పీన్ పెసో(మన కరెన్సీలో 1.5 రూపాయలు) ఇస్తామని చాటింపు వేయించారు. అంతే ఆ గ్రామంలోని ప్రజలు దోమలపై దండయాత్రనే మొదలుపెట్టారు. దోమల్ని చంపి, వాటిని లార్వాలను పట్టుకొచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు. ఐదు దోమలకు రూపాయిన్నరేనా అని తీసిపారేయకండి. దోమలు కుప్పగా దొరికితే గట్టిగా సంపాదించవచ్చు. ఇప్పటికే ఆ గ్రామంలో చాలా మంది కేవలం దోమల్ని చంపడమే పనిగా పెట్టుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదికూడా చదవండి…

